నైపుణ్యాభివృద్ధితోనే చైనాతో పోటి

ప్రధాని నరేంద్ర మోడీ ఉవాచ

modiదేశాభివృద్ధికి యువతే కీలకం
వారిలో నైపుణ్యాల వృద్ధికి కృషి
మళ్లీ శ్వేత, హరిత విప్లవాల ఆవశ్యకత

 
న్యూఢిల్లీ : అభివృద్ధిలో చైనాతో భారత్ పోటీ పడాలంటే.. వ్యవసాయ, ఇంధన రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంతో పాటు దేశ యువతరానికి నైపుణ్యాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. దేశ జనాభాలో 35 ఏళ్ల వయసు కన్నా లోపున్న వారు 65% మంది ఉన్నారని, ఆ యువతరం శక్తిసామర్ధ్యాలను దేశం సమర్ధంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘నైపుణ్యం, భారీతనం, వేగం’ ఈ మూడింటిపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. దేశాన్ని నిపుణులైన ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోగల ఉపాధ్యాయులను రూపొందించుకోవాల్సి ఉందని మోడీ అన్నారు. బిబేక్ డెబ్రాయ్, ఆష్లీటెల్లిస్, రీస్ ట్రీవర్‌లు సంయుక్తంగా సంపాదకత్వం వహించిన ‘గెటింగ్ ఇండియా బ్యాక్ ఆన్ ట్రాక్- యాన్ యాక్షన్ అజెండా ఫర్ రిఫామ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. దేశ రాజధానిలో ఆదివారం జరిగిన ఆ కార్యక్రమంలో ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశ జాతీయ జెండాలోని రంగులతో పోలుస్తూ దేశాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడుల్లో వృద్ధి, వ్యవసాయ సాంకేతికత, గోదాముల వికేంద్రీకరణ.. లక్ష్యంగా రెండోసారి హరిత విప్లవం రావాల్సి ఉందన్నారు. పాలు, పాల ఉత్పత్తుల భారీ దిగుబడులకు సంబంధించిన శ్వేత విప్లవం మరో సారి రావాల్సి ఉందన్నారు. దాంతోపాటు పశుసంపద ఆరోగ్యాన్ని పరిరక్షించే ప్రత్యేక వ్యవస్థ రూపొందించాల్సి ఉందన్నారు. అలాగే దేశంలో ఇంధన శక్తి వనరుల అభివృద్ధికి, సౌరశక్తి లాంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి కృషి చేయాల్సి ఉందన్నారు. అశోక చక్రంలోని నీలం రంగును ప్రస్తావిస్తూ.. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి పాటు పడాల్సి ఉందన్నారు. అలాగే మౌలిక వసతుల రంగంలో హైవేల నుంచి దృష్టిని ‘ఐ-వే’లకు మళ్లించాల్సి ఉందని, అందువల్ల ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ వ్యవస్థను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని మోడీ వివరించారు.
 

Leave a Comment