నో ఇంగ్లీష్ అంటే చితక్కొట్టారు: ఇండియన్‌కు సారీ చెప్పిన అమెరికా గవర్నర్

వాషింగ్టన్: తమ దేశానికి అతిథిగా వచ్చిన భారతీయ వ్యక్తి పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించారని, అందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని అలగామా గవర్నర్ రాబర్ట్ బెంట్లీ అన్నారు. ఆయన బాధిత భారతీయుడికి క్షమాపణలు చెప్పారు. దీని పైన ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభమయిందని చెప్పారు. తన క్షమాపణను అంగీకరించాలని ఇండియా కాన్సులేట్ జనరల్‌కు లేఖ రాశారు. అజిత్ కుమార్, ఇండియన్ జనరల్ కౌన్సిల్ ఇన్ అట్లాంటాకు లేఖ రాశారు. మాడిసన్ పోలీసుల ప్రవర్తనకు తాను చాలా బాధపడుతున్నానని, ఇది దురదృష్టకర సంఘటన అన్నారు. బాధిత పటేల్ కోలుకోవాలని ఆకాంక్షించారు. అలబామా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీకి కూడా విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. మరోవైపు, గాయపడ్డ పటేల్‌ను హంట్స్‌విల్లే ఆసుపత్రి నుండి రిహాబిలేషన్ సెంటర్‌కు తరలించారు.

కాగా, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తన కొడుకు దగ్గరకు వెళ్లిన ఇంగ్లీషు రాని పటేల్ అనే 57 ఏళ్ల వ్యక్తి పట్ల పోలీసులు ఇటీవల దారుణంగా ప్రవర్తించారు. దీని పైన అమెరికాలోని భారతీయులు, హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దీంతో గవర్నర్ స్పందించారు. పోలీసుల చర్య తప్పని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలబామాలోని హంట్స్‌విల్లేలో ఉంటున్న తన కుమారుడి వద్దకు రెండు వారాల క్రితమే బాధితుడు గుజరాత్‌కు చెందిన సురేశ్‌భాయ్ పటేల్ వచ్చాడు. గతవారం తన ఇంటినుంచి బజారుకు వచ్చిన సురేశ్‌ను పోలీసులు అడ్డగించి ప్రశ్నించారు. అయితే నో ఇంగ్లీష్ అంటూ భాష తెలియదని సమాధానమిస్తూ జేబులో చేతులు పెట్టుకున్నారు. దీంతో బెదిరిపొయిన పోలీసులు సురేశ్ ముఖాన్ని బలంగా నేలకేసి బాదడంతో ఆయన పాక్షికంగా గాయపడ్డారు. ఈ విషయంపై సురేశ్ కుమారుడు చిరాగ్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మాడిసన్ పోలీస్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు దాడికి బాధ్యులైన సిబ్బందిని సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

Leave a Comment