ములాయం రెచ్చగొట్టడం వల్లే: రేప్‌లపై మాయా, ఉమ

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అమ్మాయిలు, మహిళల పైన వరుస దారుణాల పైన4 విపక్షాలు మండిపడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పైన నిప్పులు చెరుగుతున్నారు. బిఎస్పీ అధినేత్రి మాయావతి, కేంద్రమంత్రి ఉమా భారతిలు వారిపై మండిపడ్డారు. ములాయం సింగ్ యాదవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే యూపిలో దారుణాలు జరుగుతున్నాయని ఉమా భారతి అన్నారు. అఖిలేష్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ములాయం వ్యాఖ్యలు కామాంధులకు ఊతం ఇస్తోందన్నారు. రేపిస్టులకు మరణ శిక్ష అవసరం లేదని ములాయం సింగ్ యాదవ్ గతంలో చెప్పారని మాయావతి అన్నారు. యుపిలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రాష్ట్రపతి పాలనను విధించాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచార నిందితులకు ములాయం మద్దతుందని ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలన్నారు. యుపిలో అత్యాచారాల పైన సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అటవిక రాజ్యమేలుతోందన్నారు. నేరస్తులకు అదుపు అడ్డు లేకుండా పోయిందన్నారు. కాగా, బడౌన్‌లో ఇద్దరు యువతుల పైన అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ, ఆదివారం మాయావతి పరామర్శించారు.

Leave a Comment