ఫేస్‌బుక్ గిఫ్ట్..!

గూగుల్ ప్రతి సెకనుకూ 40 వేల సెర్చ్ క్వెరీలను హ్యాండిల్‌చేస్తోంది. ఇదే సెకనులో ఫేస్‌బుక్‌లో 40 వేల లైక్‌లు, కామెంట్లు నమోదవుతున్నాయి. ఇంతే సమయంలో యూట్యూబ్‌లోకి రెండు గంటల నిడివితో ఉండే వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు 293 కోట్ల మంది ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంది… ఈ గణాంకాలు ఆశ్చర్యపరుస్తాయి. అయితే ఇవన్నీ కాయిన్‌కు ఒకవైపు మాత్రమే. ఈ రోజుకీ ప్రపంచంలో ఎంతో మందికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేదు. వారి సంఖ్యవందల కోట్లలో ఉంది! ఒకవైపు 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చేస్తున్నా… కొన్ని ప్రాంతాల్లో మాత్రం తొలితరం ఇంటర్నెట్ సేవలు కూడా లేవు. ఈ పరిస్థితిని చూసి చలించిపోతున్నాడు ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడిగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న ఆయన ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అందరికీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. సామాజిక, సాంకేతిక ప్రయోజనాలతో కూడిన ఈ వ్యవహారం జుకర్‌బర్గ్ ఇమేజ్‌ను రెట్టింపు చేస్తోంది. టెక్నాలజీ రంగంలో ఆసక్తిని రేపుతోంది. ఆప్టికల్ ఫైబర్… ప్రపంచ గతిని మార్చింది. ఇంటర్నెట్ ఇంత విస్తృతం అయ్యిందంటే అది ఆప్టికల్ ఫైబర్ అందించిన సౌకర్యం. సుదూర ప్రాంతాలకు ఉత్తమ బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్ సిగ్నల్స్ పాస్ చేయగల ఆప్టికల్ ఫైబర్ ప్రపంచ గతిని మారుస్తోంది, మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తోంది. మరి ఈ విషయంలో మానవాళి ఆప్టికల్‌ఫైబర్‌కు కృతజ్ఞతతో ఉండాలి. అయితే… ఎంతసేపూ ఆప్టికల్ పైబర్ మీదే ఆధారపడితే… విస్తరణ వేగం తగ్గుతుంది.. ఇంటర్నెట్‌ను విస్తృతం చేయాలి.. ఆ సౌకర్యాన్ని ఎక్కువమందికి అందించాలి… ఈ ప్రపంచంలో బతుకుతున్నవారందరికీ ఇంటర్నెట్ ఒక ప్రాథమిక హక్కు కావాలి. మరి అలా చేయాలంటే ఆఫ్లికల్ ఫైబర్, వెబ్ కేబుల్స్, లైన్‌ల మీద ఆధారపడితే అంత సులభంగా సాధ్యం కాదు. అందుకే ఈ వ్యవహారాన్ని కొత్తరకంగా ముందుకు తీసుకెళ్లాలని ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ భావిస్తున్నాడు. అందుకు వారు డ్రోన్స్ మీద ఆధారపడాలని భావిస్తున్నారు. గాల్లో విహరిస్తూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించే డ్రోన్స్‌ను రూపొందించే ప్రయత్నంలో ఉంది ఫేస్‌బుక్ యాజమాన్యం.

Leave a Comment