బంగారంపై దిగుమతి సుంకం తగ్గింపు

2హైదరాబాద్: ముందు నుంచి అనుకున్నట్లుగానే బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయి. బంగారం దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.  సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్‌ అండ్ కస్టమ్స్‌ శాఖ వెండి, బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది.  10 గ్రాముల బంగారంపై సుంకం 424 నుంచి 408 డాలర్లకు తగ్గించారు. అలాగే  కిలో వెండిపైన 650 డాలర్ల నుంచి 615 డాలర్లకు తగ్గించారు. దీంతో దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉంది.


గత కొద్ది  రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు సుంకం తగ్గించడంతో ఇంకా తగ్గుతాయి. బంగారం మార్కెట్‌లో స్పెక్యులేటర్లు, స్టాకిస్టులు పెద్ద ఎత్తున అమ్మకాలు సాగించడం, పారిశ్రామిక రంగం నుంచి కూడా పసిడికి డిమాండ్ బాగా తగ్గడం వంటి పరిణామాలతో గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే బంగారం ధరలు బాగా తగ్గాయి. 2010లో ధనత్రయోదశి సందర్భంగా 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ.31,250 పలికింది. 2011, 2012 సంవత్సరాల్లో ధర రూ.31,150 నుంచి రూ.30,350 మధ్య కొనసాగింది. 2013 సంవత్సరాంతానికి 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.30,000 నుంచి రూ.31,500 మధ్య ఉంది.  నెల రోజుల క్రితం ఏప్రిల్ 29న  24 క్యారెట్ల ధర రూ.30,300 గా ఉంది. మే 29 గురువారం నాటికి 24 క్యారెట్ల ధర రూ.27,500కు పడిపోయింది.

Leave a Comment