బరువైన ‘భూగ్రహం’

aవాషింగ్టన్: మనకు 560 కాంతి సంవత్సరాల దూరంలో డ్రాకో నక్షత్రమండలంలోని కెప్లర్-10 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహమిది. పేరు కెప్లర్-10సీ. హార్వార్డ్-స్మిత్‌సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మన భూమి కన్నా రెం డు రెట్ల సైజు, 17 రెట్ల బరువు ఉన్న ఈ గ్రహం సౌరకుటుంబం వెలుపల ఇప్పటిదాకా కనుగొన్న భూమిలాం టి అన్ని గ్రహాల్లోకెల్లా పెద్దదని, అందుకే దీనిని ‘గాడ్జిల్లా ఆఫ్ ఎర్త్స్’ అని పిలుస్తున్నారు. ఇది ప్రతి 45 రోజులకోసారి తన నక్షత్రాన్ని చుట్టి వస్తోందట.
 
 భూమిలా రాళ్లురప్పలతో ఉన్న ఈ గ్రహం భారీ ఎత్తున వాయువులతో కూడా నిండి ఉందట. ముఖ్య విషయమేంటంటే.. ఇది పుట్టి 1100 కోట్ల ఏళ్లు అయిందట. అంటే.. బిగ్‌బ్యాంగ్ జరిగి విశ్వం ఏర్పడిన 300 కోట్ల ఏళ్లకే ఇది పుట్టిందన్నమాట. అందుకే దీనిపై అధ్యయనం ద్వారా తొలినాటి విశ్వం గురించి అనేక వివరాలు తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఊహాచిత్రంలో ముందువైపు ఉన్నది కెప్లర్-10సీ, మధ్యలో ఎరుపు రంగు చుక్కలా ఉన్నది గతంలోనే కనుగొన్న లావా గ్రహం కెప్లర్-10బీ కాగా, వెనక ప్రకాశంతో కనిపిస్తున్నది వాటి నక్షత్రం.

Leave a Comment