బాబా ఆశ్రమంలో డెడ్ బాడీలు…

హర్యానాలోని హిస్సార్ జిల్లాలో రాంపాల్ స్వామీజీ ఆశ్రమం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్‑లోక్ ఆశ్రమ స్వామీజీ రామ్‑పాల్‑పై హర్యానా పంజాబ్ ఉమ్మడి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. స్వామీజీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆశ్రమానికి చేరుకున్నారు. స్వామీజీని అరెస్ట్ చేసేందుకు వీలు లేదంటూ ఆయన భక్తులు, అనుచరులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి భాష్పవాయువు ప్రయోగించారు. పలువురు భక్తులు, అనుచరులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

ఆశ్రమంలోపల నలుగురు మహిళల మృతదేహాలతో పాటు 18 నెలల చిన్నారి డెడ్ బాడీ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‑మార్టం నిమిత్తం అఘోరాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల సవిత , రోహితక్‑కి చెందిన 45 ఏళ్ల వయసున్న సంతోష్ ,  బిజినోర్ కు చెందిన 70 ఏళ్ల  రాజ్ బాల ,  పంజాబ్‑లోని సంగురూర్ కి చెందిన 50 సంవత్సరాల వయసున్న మలికిత్ కౌర్   గా గుర్తించినట్లు డీజీపీ తెలపారు.

స్వామీజీని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం రాత్రి సుమారు 10 వేల మంది స్వామీజీ మద్దతుదారులు ఆశ్రమం వదిలి వెళ్లారు.  కొంతమంది లోపలే ఉన్నారు. రాంపాల్ కోర్టుకు హాజరవకుండా ఆశ్రమంలో రహస్య ప్రదేశంలో వున్నట్లు భావిస్తున్నారు. బయట నుంచి ఆయన లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నా.. స్వామీజీ కానీ, ఆయన అనుచరులుకానీ.. వినడం లేదు. బర్వాలా పట్టణంలో వున్న ఈ ఆశ్రమం 12 ఎకరాల మేర వుంది. లోపల బలవంతంగా మహిళలు, పిల్లలను ఆపేశారని పోలీసులు చెబుతున్నారు. ఆశ్రమం చుట్టూ భారీ ఎత్తున భద్రతా సిబ్బంది మోహరించారు. ఏ క్షణంలోనైనా స్వామీజీని అరెస్ట్ చేసి కోర్టుముందు హాజరుపరిచే అవకాశాలు కనబడుతున్నాయి.

Leave a Comment