బాబు కేబినెట్ ప్రక్షాళన?

రాష్ట్ర మంత్రివర్గం పనితీరుపై అసంతృప్తితోవున్న ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు. మంత్రివర్గం ఏర్పడి ఐదు నెలలు గడిచినప్పటికీ అనేకమంది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నారన్న అసంతృప్తి చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. అనేక మంత్రివర్గ సమావేశాల్లో పనితీరుపై హెచ్చరికలు చేసినప్పటికీ మార్పు కనిపించడం లేదని భావిస్తున్న ఆయన, చివరకు కేబినెట్‌లోనే మార్పులు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెలలోనే భారీ మార్పులు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీనికోసం చంద్రబాబు అంతర్గత కసరత్తు కూడా చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో కనీసం ఐదుగురి పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్టు బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక మంత్రి వెల్లడించారు. పనితీరు సక్రమంగా లేనివారిలో ఇద్దరు మహిళా మంత్రులు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వారి శాఖల్లో పనితీరు నిరాశాజనకంగా ఉందని, తమ శాఖల అధికారులపై ఆ మంత్రులు పట్టు సాధించలేకపోతున్నారని సమాచారం. గతంలోనూ ఇదే అంశంపై ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్ర మంత్రివర్గంలో 26మందిని చేర్చుకునేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 19మంది మాత్రమే ఉన్నారు. మరో ఏడుగురిని చేర్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఆరుగురికి అవకాశం కల్పిస్తూనే ఉన్న వారిలో ఐదారుగురిని మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద పదిమంది వరకూ కొత్తవారికి కేబినెట్‌లో స్థానం ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉన్న మంత్రులను తప్పించడంపై చంద్రబాబు పునరాలోచన చేసే పరిస్థితి ఉత్పన్నమైతే వారి శాఖలను మార్పు చేసే అవకాశాలూ ఉంటాయని అంటున్నారు.  ప్రభుత్వానికి ఆదాయం వచ్చే కీలక శాఖకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో ఒక మహిళా మంత్రి అయితే ఇటీవల బదిలీల ప్రక్రియ సమయంలో మొత్తం బాధ్యత ముఖ్యమంత్రికే వదిలివేసినట్టు సమాచారం. ఈ విధానంపైనా ముఖ్యమంత్రి అసంతృప్తిగానే ఉన్నట్టు సమాచారం. కాగా, పేద ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా ఉండాల్సిన గృహనిర్మాణం వంటి శాఖల మంత్రుల తీరుపైనా చంద్రబాబు కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఇప్పటికే వారు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి, విస్తరణ సమయంలోనే మార్పులు, చేర్పులకు ఆలోచన చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Leave a Comment