మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరవచ్చుననే ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన టీడీపీలో చేరి, సనత్ నగర్ నుండి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్నటి వరకు గ్రేటర్ తెలుగుదేశం పార్టీ కీలక నేత. ఆయన కొద్ది రోజుల క్రితం తెరాసలో చేరి మంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో తలసాని టీడీపీ తరఫున సనత్ నగర్ నియోజవకర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు.
టీడీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన తన శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దానిని సభాపతి ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సనత్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగనుంది. సనత్ నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే.. అనే ఆలోచనలతో ఇప్పటి నుండి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సమాయత్తమవుతున్నాయి
ఇందులో భాగంగా గత ఎన్నికల్లో టీడీపీ తరఫున సనత్ నగర్ నుండి పోటీ చేసిన తలసాని… ఈసారి తెరాస తరఫున పోటీ చేస్తారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుండి పోటీ చేసేందుకు ముఖేష్ గౌడ్‌ను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకీ మంచి క్యాడర్ ఉంటుంది. అయితే, తెలంగాణ వాదం నేపథ్యంలో టీడీపీ క్రమంగా బలహీనపడుతోంది.
అయితే, గ్రేటర్ హైదరాబాదులో మాత్రం టీడీపీ బలంగానే ఉందనేందుకు గత ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమి ఎక్కువ సీట్లను గెలుచుకోవడమే నిదర్శనం. అయితే, నగరంలో టీడీపీలో ఎప్పటి నుండో ఉండి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తలసాని, తీగల కృష్ణారెడ్డి వంటి వారు ఆ పార్టీని వీడి కారు ఎక్కారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో టీడీపీ బలహీనపడకుండా ఉండేందుకు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల ముఖ్య నేతల వైపు దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ముఖేష్ గౌడ్‌ను పార్టీలోకి తీసుకుంటున్నారని అంటున్నారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి నగరంలో అంతగా బలం లేనట్లుగా కనిపిస్తోన్నందున ఆయన కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌లో టీడీపీ కార్యకర్తలు, ముఖేష్‌కు ఉన్న అండతో సనత్ నగర్‌లో గెలవడంతో పాటు హైదరాబాదులో పార్టీని పటిష్టం చేసేందుకు ఉపయోగపడుతుందని బాబు భావిస్తున్నారని సమాచారం.
Recent Comments