బాబు ‘ప్రమాణా’నికి భారీ ఏర్పాట్లు

  • 1 8వ తేదీ ఉదయం 11.35కు ముహూర్తం
  •  గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీ
  •  భారీగా స్వాగత ఏర్పాట్లు
  •  గ్రౌండ్‌లో పార్టీ జెండాలు బ్యాన్
  •  హడావిడి వద్దన్న చంద్రబాబు

 సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 8న ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేయాలని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ఏఎన్‌యూ ఎదురుగా ఉన్న విశాలమైన స్థలంలో ప్రమాణస్వీకారం చేయాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు.

ఈ నేపథ్యంలో గురువారం కృష్ణా,గుంటూరు జిల్లా నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.  భారీ ఏర్పాట్లు వద్దని, నిడారంబరంగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు తరలి వస్తారని, అందువల్ల భారీగానే నిర్వహించాలని రెండు జిల్లాల నేతలు సూచించినట్లు తెలిసింది.  
 
గన్నవరం నుంచి భారీ ర్యాలీ….

గన్నవరం విమానాశ్రయం  నుంచి గుంటూరుకు  వెళ్లే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతమంతా పసుపు మయం చేయాలని తెలుగు తమ్ముళ్లు నిర్ణయించుకున్నారు. గన్నవరం నియోజకవర్గమంతా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, తూర్పు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్,  పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కేశినేని నాని, బుద్దావెంకన్న, నాగుల్‌మీరా  బాధ్యతలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలను పెద్ద ఎత్తున సభాస్థలికి తరలించాలని నాయకులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
 
వేదిక వద్ద బ్యానర్లకు నో చాన్స్….

ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా జరిగే అవకాశం ఉన్నందున అక్కడ పార్టీ బ్యానర్లు కట్టవద్దని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. వేదిక ఏర్పాట్లు గుంటూరు జిల్లా నేతలకు అప్పగించగా, బయట ఏర్పాట్లు కృష్ణాజిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేనినాని తదితరులకు చంద్రబాబు అప్పగించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలకు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు.
 
ప్రధాని, ఇతర ముఖ్యులు వస్తారా?

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడి, ఎన్టీఏలోని ఇతర భాగస్వామ పార్టీల నేతల్ని చంద్రబాబు ఆహ్వానిస్తున్నారని వారంతా వచ్చే అవకాశం ఉదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారంతా గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లే అవకాశం ఉన్నందున వారికి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలంతా నిర్ణయించారు. వారిని ఆహ్వానించేందుకు ఒక ఆహ్వాన కమిటీని  సిద్ధం చేస్తున్నారు. నాయకులకు నగరంలోని హోటళ్లలో తగిన బస ఏర్పాటుచేసేందుకు స్థానికనేతలు సిద్ధమౌతున్నారు.
 

Leave a Comment