బెంగళూరు నగరపాలక ఎన్నికలపై అసదుద్దీన్ దృష్టి

asadbrother

జాతీయ స్థాయిలో విస్తరించే వ్యూహంతో ముందుకు సాగుతున్న మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజాగా బెంగుళూరు మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీకి దించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బిబిఎంపి) ఎన్నికల్లో మజ్లీస్ పోటీ చేసే అవకాశాలున్నాయి.

బెంగళూరులో పని చేయడం ప్రారంభించాలని తమ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు అసదుద్దీన్ ఓవైసీ ఓ జాతీయ మీడియతో చెప్పారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని కూడా ఆయన స్పష్టం చేసినట్లు ఆ మీడియా రాసింది. బిబిఎంపి ఎన్నికల్లో 198 వార్డులపై మజ్లీస్ దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో 2013 స్థానిక ఎన్నికల్లో మజ్లీస్ తన పార్టీ అభ్యర్థులను దించింది. బసవకళ్యాణ్, బీదర్‌ల్లో మూడు సీట్లను గెలుచుకుంది. ఢిల్లీ శానససభా ఎన్నికల్లో మజ్లీస్ పోటీ చేస్తుందా, లేదా అనేది తేలడం లేదు. అయితే, ప్రాథమికమైన శాఖల ఏర్పాటులో మాత్రం అది దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఓఖ్లాలో ఆ పార్టీ పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

తమ పార్టీ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగుతుందని గతంలో అసదుద్దీన్ ఓవైసీ మీడియా సమావేశాల్లో కూడా చెప్పారు. తృణమూల్ కాంగ్రెసు నుంచి గానీ సమాజ్‌వాదీ పార్టీ నుంచి ముస్లిం ఎమ్మెల్యేలు గెలిచినా ప్రజలకు తగిన న్యాయం జరగడం లేదని అసదుద్దీన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

Leave a Comment