భారత్‌లో కరువు.. వరదలు తీవ్రం

–  దక్షిణాసియాలో వర్షాకాలంలో గణనీయమైన మార్పులు
–  స్టాన్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తల హెచ్చరిక
india_droughtవాషింగ్టన్‌ :  ఈసారి భారతదేశంలో వర్షాకాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయని స్టాన్‌ఫోర్డ్‌ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. విపరీతమైన వర్షాలు లేదా విపరీతమైన వేడిమి ఈ రెండు అనుభవంలోకి రానున్నాయని, వీటివల్ల మధ్య భారతంలో తీవ్రమైన కరువు కాటకాలు, అలాగే వరదల ముప్పు కూడా పొంచి వుందని వారు పేర్కొన్నారు. ఈ పరిశోధకుల్లో ఇద్దరు భారత్‌కు చెందిన శాస్త్రవేత్తలు కూడా వున్నారు. దక్షిణాసియాలో వర్షాకాలంలో ఇటీవలి దశాబ్దాల్లో ఈ తరహా ధోరణి బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఏడాదిలో ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే సంభవించే తీవ్రమైన వర్షపాతాన్ని మనం తరచుగా పలు ప్రాంతాల్లో చూస్తున్నాము, దానివల్ల చాలా తీవ్రమైన, విస్తృతమైన ప్రభావం వుంటుందని స్టాన్‌ఫోర్డ్‌ వుడ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ది ఎన్విరాన్‌మెంట్‌లో సీనియర్‌ ఫెలో అయిన నోవా డిఫెన్‌బాగ్‌ అన్నారు. నైరుతి రుతుపవనాలు భారతదేశంలో 85శాతం వర్షాపాతానికి కారణమవుతాయి. 
 పైగా దేశ వ్యవసాయ రంగానికి కూడా ఇవి చాలా కీలకమైనవి. ఈ అధ్యయన ప్రధాన రచయిత అయిన దీప్తి సింగ్‌ మాట్లాడుతూ, తీవ్రమైన వర్షాలు కురిసే సమయంలో ఎంత మొత్తం వర్షపాతం నమోదవుతోందన్నది కూడా ఇక్కడ చాలా కీలకమన్నారు. పంట చాలా కీలకమైన దశలో వున్నపుడు అనేక రోజుల పాటు అసలు వర్షాలు లేకపోయినా సరే పంట దిగుబడి తగ్గుతుందని, లేదా మొత్తంగా పంట నాశనమయ్యే ప్రమాదముందని అన్నారు. అలాగే తక్కువ సమయంలోనైనా విపరీతంగా వర్షాలు పడితే అప్పుడు కూడా పెను విపత్తులు సంభవించే అవకాశం వుందన్నారు. 60ఏళ్ళ కాలంలో పడిన వర్షపాత ధోరణులను ఈ బృందం సమీక్షిస్తోంది.

Leave a Comment