మంత్రి పదవా? ఉప ముఖ్యమంత్రా?

images (1)సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు బెర్త్ ఖరారైంది. అయితే ఈయన్ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారా? మంత్రి పదవితో సరిపెడతారా? అనే విషయంపై ఆదివారం స్పష్టత రానుంది. సామాజిక సమీకరణాలు, ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడిన అంశాలు నారాయణకు అనుకూలంగా మారనున్నాయి.
 
 తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉన్నప్పటికీ నారాయణ ఎప్పుడూ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయలే దు. అలాగని పరోక్షంగా కూడా పార్టీకి సేవలందించలేదు. మూడు నెలల కిందట ముగిసిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నారాయణ పేరు టీడీపీ తెర మీదకు తెచ్చింది. ఆయన్ను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అయితే ఆ నాటి సమీకరణల్లో  ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
 
 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే కీలకమైన పదవి ఇచ్చే ఒప్పందంతో నారాయణ కోస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే ఇంధనం అందించారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే నారాయణకు కాపు సామాజిక కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఆలోచన కూడా చేశారు. అయితే జిల్లా నేతల నుంచి వెల్లడైన అభ్యంతరాలు, ఒకేసారి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇబ్బందులు ఎదురు కావచ్చనే ఆలోచనలు కూడా జరిగాయి. దీంతో చంద్రబాబు ప్రస్తుతానికి నారాయణను మంత్రిని చేసి ఆ తర్వాత శాసన మండలికి ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.  ఆయన్ను మంత్రిని మాత్రమే చేస్తారని టీడీపీలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో  తొలి విడతతో ఆయన పేరు ఉండక పోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నారాయణకు పదవి విషయంలో ఆదివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 చలో గుంటూరు
 చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి జిల్లా నుంచి సుమారు మూడు వేల మంది కార్యకర్తలు, నాయకులు ఆదివారం గుంటూరు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటు పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వారికి చంద్రబాబు నుంచి ఆహ్వానాలు అందాయి. వీరు కాకుండా ఆహ్వానం లేని వారు కూడా చాలా మంది గుంటూరు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
 

Leave a Comment