మరింత మంది పిల్లల్ని కనండి: చంద్రబాబు కొత్త నినాదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త నినాదాన్ని అందుకున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మరింత మంది పిల్లల్ని కనండి అంటూ ఆయన న్నారు. ఇప్పుడు పిల్లలను కనకపోతే భవిష్యత్తులో సంపదను సృష్టించినా దానిని అనుభవించే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం పాదయాత్రకు వచ్చిన ఆయన శెట్టిపేట, తాళ్లపాలెంలలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

రాను రాను జనాభా సంఖ్య తగ్గిపోతోందని, తాను కూడా ఒక అబ్బాయితోనే సరిపెట్టుకున్నానని, ఇప్పుడు పరిస్థితులు మారాయని, జనాభా తగ్గిపోతోందని, చాలామంది ఇప్పుడు పిల్లల్ని కనడం లేదని ఆయన అన్నారు. చదువుకున్నవాళ్లు అయితే మరీ పెళ్లిళ్లే చేసుకోవడం లేదని, కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నా ఎందుకొచ్చిన పిల్లలు అంటూ వచ్చిన డబ్బులతో ఎంజాయ్‌ చేద్దామని అనుకొని కొంతమంది పిల్లల్ని కనకుండా ఉంటున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా తొమ్మిది లక్షల మంది మరణిస్తుంటే..మరో తొమ్మిది లక్షల మంది పుడుతున్నారని ఆయన అన్నారు.

మరికొన్ని రోజులుపోతే చనిపోయేవారి సంఖ్య పెరుగుతుందని, పుట్టే వారి సంఖ్య తగ్గుతుందని, అప్పుడు మన ఊళ్లో అంతా ముసలివాళ్లే కనిపిస్తారని, ఈరోజు జపాన్‌లో అదే జరిగిందని, ఆ దేశం అంతా ముసలివాళ్లేనని, దేశం దేశం పూర్తిగా చిన్న పిల్లలు లేకుండాపోయే పరిస్థితి ఏర్పడిందిని, అందుకే ఇప్పుడు మళ్లీ ఆలోచిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

వీలయితే ఒకరిద్దరిని ఎక్కువగా పుట్టిస్తే నష్టం లేదని చెప్పారు. కానీ, అసలు పిల్లలు లేకుండా ఉండడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. పిల్లల్ని కనాలని, అలాంటి అవసరం ఇప్పుడు వచ్చిందని చెప్పారు. పిల్లలే లేకపోతే సమాజమే లేదని, అందరూ ముసలివాళ్లు అయిపోతారని, అప్పుడు కష్టపడలేరని వివరించారు. అదే జరిగితే, ‘‘ఇప్పుడున్న సంపదను రెట్టింపు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ సంపద పెరిగినా, దానిని వినియోగించుకునే అవకాశం ఉండదు” అని హెచ్చరించారు.

అమెరికా వంటి దేశాల్లో ఉన్న కుటుంబ వ్యవస్థతో పోలిస్తే మన వ్యవస్థ అద్భుతంగా ఉంటుందని, ఇక్కడ పిల్లాపాపలతో అందరూ కళకళలాడడం వల్లే మెరుగైన సమాజానికి అవకాశం ఏర్పడిందని వివరించారు. చంద్రబాబు తన ప్రసంగంలో ‘పిల్లల్ని కనండి’ అంటూ వ్యాఖ్యానించినప్పుడు ప్రజలు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. వారి నవ్వులను గమనించిన చంద్రబాబు పిల్లల్ని కనాలని తాను ఎందుకంటున్నదీ వివరించారు. భవిష్యత్తు తరం పెరగాలంటే పిల్లల్ని కనడమే మార్గమని వ్యాఖ్యానించారు.

Leave a Comment