మాజీ సిఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కన్నుమూత

NJRహైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. హైదరాబాదులోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం ఉదయం గం.5.15 నిమిషాల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గత మూడేళ్లుగా పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతున్నారు. జనార్ధన్‌రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా వాకాడు. 1935 ఫిభ్రవరి 20న నెల్లూరు జిల్లా వాకాడులో ఆయన జన్మించారు. 1990-92 వరకు నేదురమల్లి జనార్ధన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.1972లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన మూడుసార్లు లోకసభ సభ్యుడిగా గెలిచారు. 1988-89లో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 1998లో బాపట్ల, 1999లో నర్సారావుపేట లోకసభ స్థానాల నుంచి గెలిచారు. ఆ తర్వాత 2004లో విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి విజయం సాధించారు. 2009లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2010లో మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1978 – 83మధ్య ఆయన రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పనిచేశారు.నేదురుమల్లి జనార్దన్ రెడ్డిపై 2007లో నక్సలైట్ల దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. ఆయన సతీమణి నేదరుమల్లి రాజ్యలక్ష్మి వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఆయనకు రామ్‌కుమార్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి అనే కుమారులున్నారు.

Leave a Comment