మీ ఇంటి డాబా మీదే ఓ గాలిమర!!

windmillమొన్న రెండు రోజులు జెన్కో ఉద్యోగులు సమ్మె చేసేసరికి రాష్ట్రవ్యాప్తంగా అందరికీ చుక్కలు కనిపించాయి. రాజధాని హైదరాబాద్ నగరంతో సహా అన్నిచోట్లా రోజుకు ఏడెనిమిది గంటల పాటు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీంతో చాలామంది ఇళ్లమీద సోలార్ ప్యానళ్లు పెట్టించుకుని, సౌర విద్యుత్తును వినియోగించుకోవాలని భావించారు. అయితే, వీటితో ఒక ఇబ్బంది ఉంది. డాబా మీద చాలా వరకు స్థలాన్ని ఇవి ఆక్రమిస్తాయి. దానికితోడు.. సోలార్ ప్యానళ్ల (ఫొటో ఓల్టాయిక్ ప్లేట్లు) నాణ్యత, వాటి జీవితకాలం మీద కూడా అనేక అనుమానాలున్నాయి. ఇప్పుడు దీనికి ఓ సరికొత్త ప్రత్యామ్నాయం వచ్చేసింది.

అత్యంత తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకోగలిగే గాలిమరలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ది ఆర్కిమెడీస్’ అనే సంస్థ ఇటీవలే దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘లియాం మినీ ఎఫ్1’ అని పిలుస్తున్న ఈ గాలి మర అతితక్కువ గాలి వేగం (సెకనుకు 2-5 మీటర్లు)తోనూ పనిచేస్తుంది. టర్బైన్ శంఖం ఆకారంలో ఉండటమే ఇందుకు కారణం. సంప్రదాయ గాలిమరలు పెద్దపెద్ద టవర్ల మీద భారీ ఫ్యాన్ల ఆకారంలో ఉండటమే మనకు తెలుసు. కానీ ఈ టర్బైన్లను ఇంటి డాబా మీద, ఖాళీ ప్రదేశాలలో.. ఎక్కడైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీని బరువు 75 కిలోలు ఉంటుంది, వెడల్పు ఒకటిన్నర మీటరు ఉంటుంది. సెకనుకు ఐదు మీటర్ల వేగంతో గాలి వీస్తుంటే దీని నుంచి ఏడాదికి 1500 కిలోవాట్/గంట విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది దాదాపుగా ఒక ఇంట్లో ఉపయోగించుకునే విద్యుత్తులో సగానికి సమానం. అయితే, దీని ఖరీదు మాత్రం కాస్తంత ఎక్కువగానే ఉంది. సదరు కంపెనీ వెబ్సైట్లో పెట్టిన ప్రకారం అయితే ఒక్కో గాలిమరకు సుమారు 5450 డాలర్లు (భారత కరెన్సీలో 3.21 లక్షల రూపాయలు) ఖర్చవుతుంది. కానీ ఇలాంటివాటిని 14 దేశాల్లో ఏడువేల మందికి ఇప్పటికే అమ్మినట్లు కంపెనీ చెబుతోంది.

Leave a Comment