మీ నాయకత్వం భేష్!

Modiమోడీకి చైనా అధ్యక్షుడి అభినందనలు
పరస్పర అభివృద్ధికి కలసిపనిచేద్దామని పిలుపు
సానుకూలంగా స్పందించిన మోడీ   
 
 
న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తరఫున ప్రత్యేక ప్రతినిధి, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సోమవారం ప్రధాని మోడీని కలిసి, చైనా అధ్యక్షుడు పంపించిన ప్రత్యేక సందేశాన్ని అందించారు. భారత నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి జిన్‌పింగ్ ఆ సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఇరుదేశాల మధ్య శాంతియుత సహకారాన్ని జిన్‌పింగ్ ఆశించారు. ‘మీ నాయకత్వంలో భారత్ అద్భుతమైన అభివృద్ధిని, ప్రగతిని సాధించగలదు. దీర్ఘకాల వ్యూహాత్మక సహకారంలో భారత్, చైనాలు భాగస్వాములు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాలతో పాటు ఆసియాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం నెలకొనేందుకు కలిసి పనిచేద్దాం’ అని ఆ సందేశంలో అభిలషించారు. మోడీ, వాంగ్ యిలు దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. భేటీలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా పాల్గొన్నారు.

 హ్యుయెన్‌త్సాంగ్ మా ఊరొచ్చారు

 భారత్ అభివృద్ధికి చైనా అన్ని విధాలుగా సహకరిస్తుందని వాంగ్ యి ఈ సందర్భంగా మోడీకి హామీ ఇచ్చారు. చైనా, భారత్‌ల మధ్య సహకార విస్తృతికి భారత్ సిద్ధంగా ఉందని భారత ప్రధాని మోడీ వాంగ్ యికి స్పష్టం చేశారు. ఆర్థిక భాగస్వాములుగా చైనా, భారత్‌లు సహకరించుకుంటే ఇరుదేశాలకు వాణిజ్య, పెట్టుబడుల రంగంలో ప్రగతి సాధ్యం కావడంతో పాటు ఆర్థికంగా ఆసియా మరింత బలోపేతమవుతుందని మోడీ వివరించారు. తీవ్రవాద వ్యతిరేక పోరులో పరస్పరం సహకరించుకోవాలని, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భారత ప్రధాని సూచించారు. ప్రాచీన కాలం నుంచి రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక  సంబంధాలున్న విషయాన్ని మోడీ గుర్తుచేశారు. క్రీ. శ 7వ శతాబ్దంలో చైనా పండితుడు హ్యుయెన్‌త్సాంగ్ తన స్వగ్రామమైన వాద్‌నగర్‌కు వచ్చిన విషయాన్ని కూడా మోడీ తెలియజేశారు. మోడీ, వాంగ్ యిల మధ్య భేటీ నిర్మాణాత్మకంగా జరగిందని అధికార వర్గాలు తెలిపాయి. చైనా అధ్యక్షుడి నుంచి వచ్చిన సందేశానికి మోడీ సంతోషం వ్యక్తం చేశారన్నాయి. ఈ ఏడాది చివర్లోగా భారత్‌కు రావాల్సిందిగా చైనా అధ్యక్షుడికి తమ ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని మోడీ ఆ దేశ విదేశాంగ మంత్రికి మరోసారి గుర్తు చేశారు. అలాగే చైనాలో పర్యటించాల్సిందిగా చైనా ప్రధానమంత్రి లీ కెక్వియాంగ్ తనకు పంపిన ఆహ్వానానికి కూడా మోడీ సానుకూలంగా స్పందించారు. చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్య పటిష్టతకు భారత్ చేపట్టదల్చుకున్న చర్యలను సోమవారం నాటి రాష్ట్రపతి ప్రసంగంలోనూ పొందుపర్చారు.

 మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయగానే ఫోన్ చేసి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపిన మొదటి విదేశీ నేత చైనా ప్రధానమంత్రి లి కెక్వియాంగ్‌నే కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై కలసి పనిచేద్దామని ఆ సందర్భంగా కెక్వియాంగ్ సూచించారు.

 60 ఏళ్ల ‘పంచశీల’పై ప్రత్యేక కార్యక్రమం

 భారత తొలి ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ ఎన్‌లైలు రూపొందించిన ఐదు సూత్రాల పథకం ‘పంచశీల’కు అరవై ఏళ్లు నిండిన సందర్భంగా చైనాలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మోడీకి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఈ నెల 28న చైనా ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. బ్రెజిల్‌లో జులైలో జరగనున్న బ్రిక్స్ భేటీ సందర్భంగా చైనా అధ్యక్షుడితో మోడీ సమావేశమయ్యే అవకాశముంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ నాలుగుసార్లు చైనాలో పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ ఘనవిజయాన్ని చైనా మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది.
 

Leave a Comment