‘ముండే కారులోంచి కిందకు పడిపోయారు’

6న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే ప్రమాదం జరిగినప్పుడు కారు వెనుక సీట్లో కూర్చున్నారని బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే గడ్కరీ, మరో మంత్రి హర్షవర్థన్ హుటాహుటీన ఎయిమ్స్కు తరలి వెళ్లారు.

ముండే మృతిపై గడ్కరీ మాట్లాడుతూ ఈరోజు ఉదయం 6.30గంటలకు ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో కారులోంచి ఆయన కిందకు పడిపోయారని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయనతో పాటు సహాయకుడు, డ్రైవర్ ఉన్నట్లు తెలిపారు. ముండేను రక్షించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు గడ్కరీ చెప్పారు. ఉదయం ఎనిమిది గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. ముండే మరణవార్తను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమాచారం ఇచ్చినట్లు గడ్కరీ తెలిపారు.

అభిమానుల సందర్శనార్థం ముండే భౌతికకాయాన్ని ఈరోజు మధ్యాహ్నం  12.30 గంటలకు పార్టీ కార్యాలయానికి తరలించనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో ముండే స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ముంబయిలోని బీజేపీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతూ ముండే రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

Leave a Comment