ముహూర్తం ఖరారు!

– 8వ తేదీ ఉదయం 111.35 గంటలు..
– సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
– ఏఎన్‌యూ ఎదుట స్థలమే వేదిక
– మహానాడులో అధికారిక ప్రకటన
– మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఇక్కడేనా?

 
 సాక్షి, గుంటూరు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా జూన్ 8వ తేదీన గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకరం చేయనున్నారు. విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదిక నిర్మించనున్నారు. 2009 ఎన్నికలకు ముందు ఇదేస్థలంలో టీడీపీ యువగర్జనను నిర్వహించిన విషయం విదితమే. చంద్రబాబునాయుడుసీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు జూన్ 8వ తేదీ ఉదయం 11.35 గంటలకు ముహూర్తం ఖరారు చేస్తూ మహానాడు వేదికపై అధికారిక ప్రకటన చేశారు.

ఇదే వేదికపై రాష్ట్రమంత్రి వర్గం చేత కూడా ప్రమాణస్వీకారం చేయిస్తారా లేక మరోసారి వేరేచోట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత రాలేదు. అయితే దాదాపుగా మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవం కూడా ఇక్కడే నిర్వహించాలనే తలంపులో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. దీంతో మంత్రి పదవుల కోసం జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు పది రోజులుగా హైదరాబాద్‌లో మకాం పెట్టి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని వారంలో మూడు రోజుల పాటు పాలన సాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే గుంటూరు-విజయవాడ మధ్య ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో భాగంగా యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలాన్ని రెండు రోజుల క్రితం గుంటూరు రేంజి ఐజీ పీవీ సునీల్‌కుమార్, గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి, రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ పరిశీలించిన సంగతి తెలిసిందే. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు తగిన సూచనలు, సలహాలు చేశారు.


సీఎం హెలిప్యాడ్, వసతికీ ఏర్పాట్లు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార వేదిక యూనివర్సిటీ ఎదురుగా ఉన్నందున ఇక్కడి క్రీడాప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, అర్బన్, రూరల్ ఎస్పీలు క్రీడామైదానం, పరిసరాలను పరిశీలించారు. చంద్రబాబునాయుడు విశ్రాంతి తీసుకొనేందుకు అవసరమైన వసతి గృహాలను ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ పరిణామాలను గమనిస్తున్న ప్రజలు ఇక విజయవాడ- గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పడుతుందని బలంగా నమ్ముతున్నారు.

వేదిక ఏర్పాట్లపై టీడీపీ నేతల దృష్టి ..
 చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సభా వేదిక ఏర్పాటు విషయంపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులను ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తరలించాలని నిర్ణయించారు.

Leave a Comment