మోడీ ఓ సైతాన్‌: మమత

–  ప్రధాని అయితే దేశం నాశనం
–  గర్భవతులనూ చంపించిన కసాయి
–  మోడీపై నిప్పులు చెరిగిన మమత 
modi_mamathaకోల్‌కతా/న్యూఢిల్లీ : బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. సోమవారం సాయంత్రం బెంగాల్‌లోని సేరంపోర్‌లో బిజెపి అభ్యర్థి, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ బప్పీ లహరి ప్రచార సభలో పాల్గొన్న మోడీ మమతపై తీవ్ర ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఆమె ఒక్క పెయింటింగ్‌ను రూ.1.8 కోట్లకు ఎవరు, ఎందుకు కొన్నారో తెలపాలని డిమాండ్‌ చేశారు. శారద చిట్‌ఫండ్‌ యజమాని, కుంభకోణం సూత్రధారి, ప్రస్తుతం జైల్లో ఉన్న సుదీప్త సేన్‌ ఈ పెయింటింగ్‌ను కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. మమతా బెనర్జీ బెంగాల్‌ అభివృద్ధి కన్నా కుర్చీపైనే ధ్యాస పెట్టిందని, మైనార్టీ ఓట్ల కోసం బెంగాల్‌లోని బంగ్లాదేశీయులను ఉండనిస్తోందని మోడీ ఆరోపించారు. ఆయన ప్రసంగం ముగిసిన గంటలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ నుండి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. ‘గుజరాత్‌ ప్రజలను మేం ప్రేమిస్తాం. అక్కడ ఎంతో మంది చంపబడ్డారు, గర్భిణులు సైతం. మోడీ ఓ సైతాన్‌. చాలా ప్రమాదకర మనిషి. ఆయనే అధికారంలోకి వస్తే దేశం నాశనమవుతుంది. అంధకారంలో కూరుకుపోతుంది’ అని మమత బెనర్జీ ధ్వజమెత్తారు. మత ఘర్షణల సూత్రధారి నుండి అభివృద్ధి గురించి సుద్దులు చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆమె స్పష్టం చేశారు. మమతకు సన్నిహితంగా ఉండే తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఒబ్రైౖన్‌ ఒకడుగు ముందుకేసి ి మోడీని ‘గుజరాత్‌ కసాయి’గా అభివర్ణించారు. సొంత భార్యనే చూసుకోనివాడు, దేశాన్ని ఎలా చూసుకుంటాడని ప్రశ్నించారు. మమత పెయింటింగ్‌పై చేసిన ఆరోపణలను రుజువన్నా చేయాలి, లేదా క్షమాపణ చెప్పాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. న్యూఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయం నుండి రాత్రి పొద్దుపోయాక వెలువడిన ఓ ప్రకటనలో మోడీ ఊపు నుంచి తట్టుకోలేకనే మమత ఈ ప్రేలాపనలు చేశారని, ఆమెకు మతిస్థిమితం తప్పిందని బిజెపి పేర్కొంది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సుమోటోగా స్పందిస్తూ, మోడీ ఉపన్యాసం సిడిని, ట్రాన్స్‌స్క్రిప్ట్‌ని అందించాలని హుగ్లీ మెజిస్ట్రేట్‌ని ఆదేశించింది. ఎన్నికల నియామవళి ఉల్లంఘన జరిగిందా అన్న అంశాన్ని ఇసి పరిశీలించనుంది. మోడీకి సంబంధించి ఇలా ఇసి విచారణ చేయడం ఈ ఎన్నికల్లో ఇదే ప్రథమం. 
           ఇదిలా ఉండగా, మోడీ-మమతల మధ్య జరిగిన వాగ్యుద్ధం రాజకీయ పరిశీలకులకు చిక్కుముడి ప్రశ్నగా మారింది. అంతకుముందు బెంగాల్‌లో జరిపిన పర్యటన సందర్భంగా మోడీ తృణమూల్‌ పట్ల నర్మగర్భంగా వ్యవహరించాడు. బెంగాల్‌ బాగా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో స్నేహపూర్వక ప్రభుత్వం ఏర్పడాలని ఆయన అనడం వెనక తృణమూల్‌ కాంగ్రెస్‌తో ఎన్నికల అనంతరం పొత్తు గురించి సంకేతాలిచ్చినట్లుగా పలువురు భావించారు. ఇంతలో మోడీ మమతపై ఎందుకు దాడి తీవ్రం చేశాడన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. మొన్న జయలలిత, నిన్న ఫరూఖ్‌ అబ్దుల్లా, ఇప్పుడు మమత.. ఒక్కొక్కరుగా మోడీకి దూరమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. వీరంతా గతంలో బిజెపితో చేతులు కలిపినవారే కావడం గమనార్హం.

Leave a Comment