మోడీ కీలక బిల్లులకు కాంగ్రెస్ మద్దతు

మోడీ ప్రైవేటీకరణ విధానాలకే కాంగ్రెస్‌ జై కొడుతోంది.. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొస్తున్న కీలక బిల్లులకు పార్లమెంట్‌లో మద్దతిస్తామంటోంది. గత పార్లమెంట్‌ సమావేశాల్లో వ్యతిరేకించిన బిల్లులకు కూడా ఇప్పుడు అనుకూలంగ ఓటేయడానికి రెఢీ అవుతోంది. ఇప్పటికే ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లులకు విపక్షం కూడా మద్దతిస్తామని చెప్పడంతో మోడీ నెగ్గించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు.యూపీఏ అధికారంలో ఉండగా.. తెరమీదకొచ్చిన ఇన్య్సూరెన్స్‌ బిల్లుకు మార్పులు చేసి.. విదేశీ పెట్టుబడిదారులకు మరింత అనుకూలంగా మార్చింది మోడీ ప్రభుత్వం. 26శాతం నుంచి 49శాతానికి ఎఫ్‌డిఐలు పెంచుతూ తీసుకొస్తున్న ఈ బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తామంటోంది. బీమా రంగంలోని నిపుణులు, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నా.. కాంగ్రెస్‌ మాత్రం మోడీ సర్కార్‌కు వంత పాడుతోంది.మరోవైపు వామపక్షాలు, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కమర్శియల్‌ మైనింగ్‌ బిల్లు కూడా ఈ సమావేశాల్లో పార్లమెంట్‌కు రానుంది. కాప్టీవ్‌ మైన్స్‌ కాకుండా.. ప్రైవేటు కంపెనీలు మైనింగ్‌ చేసి అమ్ముకునేందుకు కొత్త చట్టంలో నిబంధనలు మార్చుతున్నారు. దీనిపై కూడా కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అత్యంత వివాదాస్పదమైన జిఎస్‌టిపై కూడా మోడీ సర్కార్‌కు అండగా ఉంటామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి జిఎస్‌టీని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ ఆదాయాలకు గండి పడుతుందని ఆందోళన చెందుతున్నాయి. కానీ దీర్ఘ కాలిక ప్రయోజనాలు.. దేశ ఆర్ధిక వ్యవస్థను రాజకీయాల కోసం పణంగా పెట్టలేమని.. కీలక బిల్లుల విషయంలో మద్దతిస్తామని కాంగ్రెస్‌ అంటోంది.

Leave a Comment