మోడీ గిఫ్ట్, ప్లాన్2019: కర్నాటకనుండి రాజ్యసభకి పవన్

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభను బహమతిగా ఇవ్వాలనుకుంటున్నారట. సీమాంధ్రలో టిడిపి, బిజెపి కూటమి విజయం, తెలంగాణలో ఆశించిన ఫలితాలు రావడంలో పవన్ పాత్ర కూడా ఉన్నట్లు ఆ రెండు పార్టీలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను రాజ్యసభకు పంపించాలని నరేంద్ర మోడీ భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ ప్రచారం సీమాంధ్రలో కాపు వర్గాలను, యువతను టిడిపి, బిజెపి కూటమి వైపు మళ్లించిందని ఆ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. సీమాంధ్రలో కాపులు గెలుపోటములను నిర్ణయించే పరిస్థితిలో ఉన్నారు. వారి ఓట్లు తమ కూటమికి పడ్డాయని టిడిపి, బిజెపి భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సరైన ప్రాతినిథ్యం ఇస్తే బాగుంటుందని మోడీ అభిప్రాయపడుతున్నారట.వచ్చే నెలలో కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కర్నాటక నుండి పవన్ కళ్యాణ్‌ను రాజ్యసభకు పంపించాలని మోడీ భావిస్తున్నారట.
ఈ సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ వల్ల తమ కూటమికి కలిగిన ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులోను ఆయనతో సత్సంబంధాలు కొనసాగించాలని టిడిపి, బిజెపిలు భావిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి తెలంగాణ, సీమాంధ్రలో బలమైన శక్తిగా ఎదిగేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. దీనికి పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తోంది. అయితే ఆయనను ఉపయోగించుకోవడానికే పరిమితం చేయకుండా ఆ స్థాయిలో గౌరవం ఇవ్వాలని బిజెపి భావిస్తోందట. అందుకే ప్రస్తుతం రాజ్యసభకు పంపించాలని చూస్తున్నారట.

Leave a Comment