యుద్ధనౌకలో మోడీ ప్రయాణం

modiగోవా : ప్రధాని నరేంద్ర మోడీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకలో ప్రయాణించారు. ఆ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. ముందుగా గోవా చేరుకున్న మోడీ.. భారత నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించి యుద్ధ నౌక మొత్తాన్ని పరిశీలించారు. తన బ్రాండెడ్ పొట్టి చేతుల రంగు కుర్తా కాకుండా.. తెల్లటి పొడవు చేతుల కుర్తా, పైజమా ధరించి, దానిమీద నీలిరంగు నెహ్రూ కోటు ధరించిన మోడీ యుద్ధనౌకలో ఉన్న మిగ్-29కె యుద్ధవిమానంలో కూడా కాసేపు కూర్చుని దాని మీద నుంచి అభివాదం చేశారు. గోవా తీరం నుంచి సముద్రంలోకి ప్రవేశించిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది. ఇది భారత నౌకాదళంలోనే అత్యంత భారీ నౌక. దీని పొడవు 283.5 మీటర్లు, వెడల్పు 59.8 మీటర్లు. మొత్తం 35 యుద్ధ విమానాలను ఒకేసారి మోసుకెళ్లే సామర్థ్యం విక్రమాదిత్యకు ఉంది. 44,500 టన్నుల బరువున్న విక్రమాదిత్యను రష్యా నుంచి కొనుగోలు చేశారు. గత ఏడాది నవంబర్ 16వ తేదీన ఇది భారత నౌకాదళంలో చేరింది.

మోడీతో పాటు నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్కే ధవన్ కూడా ఉన్నారు. వెస్ట్రన్ నావల్ కమాండ్కు చెందిన మొత్తం బలం, బలగాన్ని మోడీ పరిశీలించారు. మిగ్ 29కె, సీ హారియర్లు, పి8 లాంగ్ రేంజి మారిటైమ్ పెట్రోల్ వాహనాలు, యాంటీ సబ్మెరైన్ విమానాలు, డార్నియర్లు, సీ కింగ్ హెలికాప్టర్లు.. అన్నింటినీ మోడీ పరిశీలించారు. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత నరేంద్రమోడీ స్వదేశంలో చేసిన తొలి పర్యటన ఇదే.

Leave a Comment