రుణమాఫీకి పరిమితులు!

andhra pradeshకొనసాగుతున్న కోటయ్య కమిటీ కసరత్తు
సన్న, చిన్న కారు రైతులకే పూర్తి మాఫీ యోచన
పెద్ద రైతులకు లక్ష లేదా లక్షన్నర వరకే..!
మహిళల పేరిట ఉన్న బంగారు రుణాలకే వర్తింపు
పంట రుణాలను టర్మ్ రుణాలుగా మార్చితే మాఫీ కుదరదు


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీపై విధివిధానాలను ఖరారు చేయడానికి ఏర్పాటైన నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలోని కమిటీ కసరత్తును ముమ్మరం చేసింది. రుణ మాఫీకి అర్హతలు ఏమిటి? ఎవరికి, ఎంతవరకు రుణం మాఫీ చేయాలనే అంశంపై ఒక అవగాహనకు వచ్చింది. ఈ 22వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రాథమిక నివేదిక సమర్పించాలని భావిస్తోంది. వాస్తవానికి వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా, అంతకుముందు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాలన్నింటినీ ఎటువంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేసేందుకు వీలుగా విధివిధానాలు రూపొందించే బదులు.. కొన్ని పరిమితులకు లోబడి వాటిని ఖరారు చేసే పనిలో కోటయ్య కమిటీ ఉంది. ఇందులో భాగంగా సన్న, చిన్న కారు రైతులు తీసుకున్న మొత్తం వ్యవసాయ రుణాలను వడ్డీతో సహా మాఫీ చేయడం, పెద్ద రైతులకు మాత్రం లక్ష రూపాయలు లేదా లక్షన్నర రూపాయల వరకు మాత్రమే రుణాన్ని మాఫీ చేసే దిశగా చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో సన్న, చిన్న కారు రైతులంటే ఎవరు? పెద్ద రైతులంటే ఎవరు? అనే విషయాన్ని కమిటీ తన విధివిధానాల్లో స్పష్టం చేయనుంది. రెండున్నర ఎకరాలు కలిగిన రైతులను సన్న కారు రైతులగాను, 5 ఎకరాలు గల రైతులను చిన్నకారు రైతులగాను పరిగణించాలని కమిటీ  భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 5 ఎకరాలకు పైగల రైతులను పెద్ద రైతులుగా పరిగణించనున్నారు. అలాగే వ్యవసాయం కోసం బంగారం కుదవపెట్టి తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయరాదని, ఆ విధంగా కేవలం మహిళల పేరిట తీసుకున్న రుణాలనే మాఫీ చేసే దిశలో కమిటీ కసరత్తు కొనసాగిస్తోంది.

బంగారం కుదవపెట్టి రూ.20,102 కోట్ల మేరకు రైతులు రుణాలుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్నీ మాఫీ చేయకుండా కేవలం మహిళల పేరమీద ఉన్న బంగారు రుణాలకే (సుమారు రూ.8 వేల కోట్లు) మాఫీ వర్తింప చే యూలనే నిబంధన విధిస్తే ఎలా ఉంటుందనే అశంపై కోటయ్య కమిటీ చర్చిస్తోంది. కోటయ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో.. బంగారం కుదవకు సంబంధించి మహిళల పేరిట ఉన్న రుణాలు ఎంతో ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఒక రైతు పేరు మీద రెండు మూడు బ్యాంకుల్లో రుణాలు ఉంటే ఒక రైతుకు ఒక బ్యాంకు (ఒకే ఖాతా) రుణాన్ని మాత్రమే మాఫీ చేయాలని, దానికి కూడా సీలింగ్ విధించాలని కోటయ్య కమిటీ అభిప్రాయపడుతోంది. పంట రుణాలను వ్యవసాయ టర్మ్ రుణాలుగా మార్చితే వాటికి మాఫీ వర్తింపచేయరాదనే అంశాన్ని కూడా కమిటీ చర్చిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తింప చేయరాదని కూడా భావిస్తోంది.

Leave a Comment