రెండు నిమిషాల్లో తారుమారు…

Footballజపాన్‌పై ఐవరీకోస్ట్ 2-1 తేడాతో గెలుపు
 ఐవరీ కోస్ట్ : 2 (బోనీ 64వ ని, గెర్వినో 66వ ని.)
 జపాన్: 1 (హోండా 16వ.ని.)
 
 రెసిఫి: ఆసియా ఆశాకిరణం జపాన్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. ఆరంభంలో సాధించిన ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైన జపాన్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సమర్పించుకొని మూల్యం చెల్లించుకుంది. వెనుకబడినా పట్టుదలతో పోరాడిన ఐవరీకోస్ట్ శుభారంభం చేసింది. రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జపాన్ ఆశలపై నీళ్లు చల్లింది. కీసుకె హోండా (16వ ని.) చేసిన గోల్‌తో ఆధిక్యాన్ని కనబర్చిన జపాన్ ఆ తర్వాత తడబడింది. ద్వితీయార్ధంలో ఐవరీకోస్ట్ దూకుడుగా ఆడింది. 64వ నిమిషంలో బోనీ గోల్‌తో స్కోరును సమం చేసిన ఐవరీకోస్ట్… 66వ నిమిషంలో గెర్వినో గోల్‌తో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
 
  మ్యాచ్ ఆరంభంలో జపాన్ ఆకట్టుకుంది. దీంతో ఐవరీకోస్ట్‌కు ఇబ్బందులు తప్పలేదు.
 16వ నిమిషంలో ‘డి’ ఏరియాలో బంతిని అందుకున్న జపాన్ స్టార్ కీసుకె హోండా మిగతా పనిని పూర్తి చేశాడు. బంతిని లక్ష్యానికి చేర్చి జపాన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి జపాన్ ఆధిక్యంలో ఉంది.
 
 ద్వితీయార్ధంలో ఐవరీకోస్ట్ చెలరేగిపోయింది. వర్షం పడుతున్న కొద్దీ వారిలో ఉత్సాహం మరింత పెరిగింది. 62వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ సెరె డై స్థానంలో డ్రోగ్బాను మైదానంలోకి పంపారు.
 
  డ్రోగ్బా వచ్చి రాగానే జపాన్ డిఫెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోయాడు. ఇదే ఐవరీకోస్ట్‌కు కలిసి వచ్చింది. 64వ నిమిషంలో డిఫెండర్ సెర్గి ఆరియర్ ఇచ్చిన క్రాస్‌ను అందుకున్న ఫార్వర్డ్ విల్‌ఫ్రెడ్ బోనీ ‘హెడర్’ షాట్‌తో గోల్‌గా మలిచాడు. ఫలితంగా స్కోరు 1-1తో సమం అయింది.
 
 స్కోరు సమం చేసిన ఉత్సాహంలో ఐవరీకోస్ట్ జోరు పెంచింది. రెండు నిమిషాల వ్యవధిలో మరో గోల్ చేసింది. 66వ నిమిషంలో సెర్గి ఆరియర్ ఇచ్చిన మరో క్రాస్‌ను ఈసారి మరో ఫార్వర్డ్ గెర్వినో ‘హెడర్’ షాట్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో ఐవరీకోస్ట్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఐవరీకోస్ట్ అదే జోరును కొనసాగించింది. జపాన్‌కు స్కోరును సమం చేసే అవకాశం ఇవ్వలేదు.

Leave a Comment