రెండు రాష్ట్రాల కోసం తానా నిధుల సేకరణ

3వాషింగ్టన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం, అలాగే తెలంగాణ అభివృద్ధి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రత్యేకంగా నిధుల సేకరణ మొదలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి నిధి, తెలంగాణ అభివృద్ధి నిధి పేరుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. పలువురు సభ్యులు ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులను ఎలా సద్వినియోగం చేయాలో, ఎలా పంచాలో అన్న విషయమై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను తానా సంప్రదిస్తుందని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు.

బోర్డు సభ్యుడు కోమటి జయరాం, కార్యదర్శి వేమన సతీష్ ఇద్దరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తూ ప్రాజెక్టులు, అవసరాలను తెలుసుకుంటున్నారు. మాతృభూమి అభివృద్ధి విషయంలో ఉత్తర అమెరికా తెలుగువారు చాలా ఉత్సాహంగా ఉన్నారని మోహన్ నన్నపనేని తెలిపారు. వీళ్లు రాష్ట్రాల అభివృద్ధికి తమ ఆలోచనలను, నిధులను అందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా రెండు రాష్ట్రాలకు ఇచ్చే విరాళాల సొమ్ము మొత్తం అమెరికాలో పన్ను మినహాయింపు కూడా లభిస్తుందని ఆయన చెప్పారు. ఒక రాష్ట్రానికి లేదా రెండు రాష్ట్రాలకు కూడా విరాళాలు ఇవ్వచ్చని వివరించారు.

Leave a Comment