రెచ్చగొట్టడం కేసీఆర్‌కి మంచిదికాదు: బాబు

babuహైదరాబాద్ :  అధికారంలో ఉన్నప్పుడు అందరికీ రక్షణ కల్పించాన బాధ్యత కేసీఆర్‌పై ఉందని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శనివారం గవర్నర్ నరసింహన్‌తో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన, ఉద్యోగుల పంపకాలు, గంగిరెడ్డి వ్యవహారం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలన్నారు. రెచ్చగొట్టే విధానం మంచిది కాదని, అన్నదమ్ముల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కేసీఆర్‌కి మంచిది కాదని ఆయన హితవు పలికారు. తానెంతో కష్టపడితేనే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని  బాబు అన్నారు. జూన్ 2 తర్వాత ముహుర్తం చూసుకుని ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. తనపై మావోయిస్టలు దాడిలో గంగిరెడ్డి సహకరించాడని, పదేళ్లుగా ఎర్ర చందనం స్మగ్లింగ్ కొనసాగిస్తున్నాడని అన్నారు.

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. దేశ, జాతి ప్రయోజనాల కోసం మోడీతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన అన్నారు. వార్‌రూమ్ పెట్టిన కాంగ్రెస్ ఎన్నికల్లో అడ్రసు లేకుండా పోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Leave a Comment