రోశయ్య హఠాన్మరణం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య (88) నేడు హైదారాబాద్ లో కన్నుమూశారు.

ఉదయం నాడి వేగం తగ్గిపోయి తీవ్ర అస్వస్థతకు గురైన రోశయ్యను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌ స్టార్ ఆస్పత్రికి తరలించగా,.వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

ఆయన మరణవార్తతో పలు రాజకీయ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి, తమిళనాడు గవర్నర్ ఇలా అనేక పదవులను అలంకరించిన సుదీర్ఘ రాజకీయ చరితుడు రోశయ్య ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. వివాదరహితుడిగా పేరుపొందిన రోశయ్యకు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారు.

కొణిజేటి రోశయ్య 1933, జూలై 4 గుంటూరు జిల్లా, వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌లో పట్టభద్రులయ్యారు. విద్యాభ్యాసానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు.

1968,1974,1980లలో కాంగ్రెస్ తరపున శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లశాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు.

1979 లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖ,.1982లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో గృహ శాఖ,.1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, రవాణా, విద్యుత్ శాఖలు,.1991లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలు,.1992లో తిరిగి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్యా, విద్యుత్ శాఖలకు మంత్రిగా పని చేశారు.

1995-97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పని చేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రోశయ్య,.2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

2004, 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందిన ఆయన,.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 15 సార్లు ప్రవేశపెట్టిన రికార్డ్ సాధించారు.

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో,. 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 14 నెలలు అధికారంలో కొనసాగి 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు 2011 ఆగస్ట్ 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గనవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్ట్ 30 వరకు తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య తన సేవలందించారు.

రోశయ్య మరణానికి రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

ఆదివారం హైదరబాద్ కొంపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంచనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించబడతాయి.

~ విశ్వ ~

Leave a Comment