వాట్సాప్ వెతికింది..ఫేస్ బుక్ పట్టుకుంది!

దేశంలో మెబైల్ వినియోగం ఎంతగా పెరిగిందో అందరికి తెలిసిందే. అందరికి బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో లేవో తెలియదు కాని ఫేస్ బుక్ అకౌంట్లు మాత్రం తప్పనిసరిగా ఉంటున్నాయి. ఇక వాట్సాప్ లేదు అంటే మొబైల్ వాడేవారికి అదో లోటు, మైనస్ పాయింట్ లాంటిది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల పుణ్యమా అని సోషల్ మీడిాయ అంతగా పాపులర్ అయ్యింది. వీటివల్ల చెడు మాటను కొద్ది సేపు పక్కనబెడితే.., ఓ పాపను వెతికి పెట్టడంలో మాత్రం వాట్సాప్, ఫేస్ బుక్ ఎంతో ఉపయోగపడ్డాయి. లక్షల కొద్ది మెసేజ్ లు పంపి చిన్నారిని వెతికి పెట్టడంలో కీలకం అయ్యాయి. సెప్టెంబర్ 28న ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర మూడేళ్ళ పాప ఝాన్వి తప్పిపోయింది. ఆమె ఆచూకి కోసం తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా దొరకలేదు. ప్రభుత్వాన్ని సంప్రదించినా ఫలితం రాలేదు. దీంతో పాపులర్ అయిన సోషల్ మీడియాలో తమ పాప గురించి ప్రచారం చేస్తే ఫలితం ఉంటుందని భావించారు. అయితే ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ పోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి., దీన్ని ఓ ప్రకటనలా పంపాలి అనుకన్నారు. వెంటనే ఫేస్ బుక్, వాట్సాప్ సోషల్ మీడియా సంస్థలకు డబ్బులు చెల్లించారు. వాట్సాప్ ఝాన్వి గురించి తమ వినియోగదారులకు ప్రత్యేకంగా లక్ష సందేశాలు పంపింది. అటు ఫేస్ బుక్ కూడా ఝాన్వి కోసం ప్రత్యేకంగా పేజిని క్రియేట్ చేసి ప్రచారం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం వల్ల పాపకు ఏమైనా జరగవచ్చు అని పోలిసులు ఒకింత భయపడ్డారు. అయితే అదృష్టవశాత్తు పాపకు ఏమి జరగలేదు. అటు ఝాన్విని తీసుకెళ్లిన వారు డబ్బులు డిమాండ్ చేయలేదు. వారం రోజుల తర్వాత అంటే అక్టోబర్ 5న ఢిల్లీ లోని జనక్ పురి అనే ప్రాంతంలో గుండుతో ఉన్న ఝాన్వి కన్పించింది. ఆమె మెడలో పేరుతో కూడిన ప్లకార్డు వేలాడుతూ ఉంది. విషయం తెలుసుకున్న పోలిసులు చిన్నారిని తీసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చిన్నారిని చూసి ఉద్వేగంతో కుటుంబ సభ్యులు కంటనీరు పెట్టారు. అమ్మాయిని కిడ్నాపర్లు లేదా పిల్లలు లేని వారు తీసుకెళ్లి ఉండవచ్చనీ పోలిసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప ఫొటో సోషల్ మీడియాతో పాటు మీడియాలో బాగా ప్రచారం కావటంతో దొరికిపోతామనే భయంతో రోడ్డుపై వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలిసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Leave a Comment