వాడిని తిట్టడానికి ఏ భాషలోనూ పదాలు లేవు!

3బెంగళూరు :

నీచుడు – నికృష్టుడు – ద్రోహి – కసాయి – కిరాతకుడు – కఠినాత్ముడు – పాపాత్ముడు – కామాంధుడు – కఠినాత్ముడు – కర్కోటకుడు- రాక్షసుడు – క్రూరమృగం….ఇలాంటి పదాలు ఎన్నైనా చాలవు ఈ ముసలి నక్కకు పెట్టడానికి. ఇంతటి నీచాతి నీచుడు, పరమ నికృష్టుడిని  తిట్టడానికి ఏ భాషలోనూ సరైన పదాలు ఉండి ఉండవు. కన్న కూతురని కూడా చూడకుండా బాలికపై ఓ కిరాతక తండ్రి ఏడు నెలలుగా అత్యాచారం చేశాడు. ఆ బాలిక గర్భవతి కావడంతో విషయం బయటపడింది. కర్ణాటకలోని హసన్ జిల్లా అరకలగూడు తాలూకా శానభోగనహళ్లి గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధునికి 14 సంవత్సరాల కుమార్తె ఉంది. అతని భార్య కూలి పనులకు వెళ్తుంటుంది. గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలిక గత నవంబర్‌లో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తండ్రి కూతురిపై కన్నేశాడు. బాలికను తిరిగి పాఠశాలకు పంపకుండా ఇంటిపట్టునే ఉంచేశాడు. తన భార్య పనికి వెళ్లినప్పుడు మద్యం మత్తులో ఇంటికి చేరుకుని ఒంటరిగా ఉన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.

తండ్రి దాష్టీకాన్ని బాలిక ప్రతిఘటిస్తూనే ఉంది. అయితే ఆ కసాయి తండ్రి కత్తి చూపి చంపేస్తానని బెదిరించి లొంగదీసుకునేవాడు. కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు లోనైన బాలికను అరకలగూడు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యపరీక్షల అనంతరం బాలిక ఐదు నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తల్లి నిలదీస్తే తండ్రి చేసిన అఘాయిత్యాన్ని బాలిక చెప్పింది. గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించారు. అయితే వైద్యులు ఆమె ఆరోగ్యం దృష్ట్యా నిరాకరించారు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు బాలికకు అండగా నిలిచి, పోలీసులకు ఫిర్యాదుచేశారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, బాధితురాలిని మహిళా శిశు సంక్షేమ శాఖకు అప్పగిస్తామని పోలీసులు  తెలిపారు.

Leave a Comment