విక్రమ్‌కు డబుల్ షాక్!

11సమంత ఇప్పుడు గ్లామర్ తార మాత్రమే కాదు… మంచి నటి కూడా. ‘మనం’తో నటిగా అందరి మనసులనూ గెలుచుకున్నారామె. సమంతతో మంచి మంచి ప్రయోగాత్మక పాత్రలు చేయించొచ్చనే అభిప్రాయానికి దర్శక, నిర్మాతలొచ్చేశారు కూడా. సమంత కూడా ఇక నుంచి కూడా ఇలాగే… విభిన్నంగా ముందుకెళ్లాలనుకుంటున్నారట. అందుకు తగ్గట్టుగానే తన కెరీర్‌ను మలచుకుంటున్నారామె. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పక్కన పెడితే… కొత్తగా ‘ఓకే’ చేసే సినిమాల విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకుంటున్నారు సమంత. అభినయానికి ఆస్కారముంటే తప్ప సినిమా ఒప్పుకోకూడదనే నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవలే తమిళంలో విక్రమ్‌కు జోడీగా నటించడానికి అంగీకారం తెలిపారామె.
 
 దర్శకుడు మురుగదాస్ నిర్మించనున్న ఈ చిత్రం మే 26న మొదలైంది. ఈ చిత్రంలో సమంత ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు చెన్నై టాక్. ఇందులో విక్రమ్ ఆటో డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఆయనను ఇద్దరు సమంతలు ప్రేమిస్తారన్నమాట. ఒకదానికొకటి పొంతన లేని పాత్రలని కోలీవుడ్ సమాచారం. అయితే… ఈ విషయాన్ని ఇటీవల తమిళ మీడియా సమంతను అడిగితే -‘‘ఆ సినిమాలో నేనేంటో చెబితే… కథ మొత్తం చెప్పేసినట్లే. కాబట్టి నో కామెంట్’’ అని సింపుల్‌గా చెప్పి తప్పుకున్నారు సమంత. ఏది ఏమైనా ఈ సినిమాతో నటిగా సమంత మరింత ఎత్తుకు ఎదగడం ఖాయం అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. అంతేకాదు… ఇదే నిజమైతే… ఈ తరంలో అనుష్క, ప్రియమణి తర్వాత ద్విపాత్రాభినయం చేసిన తారగా కూడా క్రెడిట్ కొట్టేస్తారు సమంత.

Leave a Comment