విజయవాడలో ఐడి ప్రూఫ్ ఉండాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరగబోతున్న విజయవాడలో పోలీసులు తమ పహారాను మరింత పటిష్టం చేశారు. కాగా రాత్రి పూట, మరియు తెల్లవారుఝామున నగరంలో అధికంగా నేరాలు నమోదు కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నేపధ్యంగా విజయవాడ నగరంలో అర్ధరాత్రి సంచరించే ప్రతీ వ్యక్తి దగ్గర సరైన ఐడెంటిటీ ప్రూఫ్ లు ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు అధికమవడంతో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, విజయవాడ రైల్వే స్టేషన్ మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో రాత్రుళ్ళు పోలీసు బందోబస్తును పెంపొందించారు. అలాగే దీనిపై విజయవాడ పోలీస్ కమీషనర్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాత్రుళ్ళు రోడ్లపై తిరిగే వ్యక్తులను ప్రశ్నించడం జరుగుతుందని, దీనిని అధిగమించడానికి ప్రతీ ఒక్కరు సరైన ఐడి ప్రూఫ్ లను తమతో తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి 11గంటల నుండి ఉదయం 6గంటల మధ్య బయట తిరిగేవారు సరైన ఐడి ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ లను తమ దగ్గర ఉంచుకోవాలని కమీషనర్ సూచించారు.

Leave a Comment