విశాఖకు తుపాను ముప్పా…ఉత్తుత్తి ప్రచారాలే

విశాఖకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఇంకా ఇలాంటి ఉత్పాతాలెన్నో వస్తాయి. సర్వనాశనం చేస్తాయి. ఇవీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు. కానీ అవి ఉట్టి వదంతులే.  అవును అవన్ని ఉత్తుత్తి ప్రచారాలే తప్ప ఉత్పాతాలు లేవు. ఉపద్రవాలు రావని వాతావరణ నిపుణులు తేల్చి చెప్పారు. భయాందోళనలో బతుకుతున్న తెలుగు ప్రజల్లో భరోసా కల్పించారు.

మరో వారం రోజుల్లో ఒడిషాకు తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ విషయం తెలియడంతో ఇప్పటికే ఒడిషా సర్కారు అప్రమత్తమైంది. యుద్ధప్రాతిపదిక ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. అయితే.. ఆ తుపాను దిశ మార్చుకుని ఏ క్షణంలోనైనా విశాఖకు దూసుకొస్తుందంటూ విస్తృతంగా ప్రచారమైన వదంతులతో విశాఖ నగరం అట్టుడికిపోయింది. హుద్‌హుద్‌ దెబ్బతో ఇప్పటికే కుదేలైన ఉత్తరాంధ్రవాసుల్లో ఈ వదంతులు తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. మరో తుఫాను వస్తే పరిస్థితి ఏంటని చాలా మంది బెంబేలెత్తిపోయారు.

వినిపిస్తున్న తుపాను పుకార్లపై వాతావరణ అధికారులు క్లారిటీ ఇచ్చారు. తుపానులేమీ ప్రస్తుతం లేవని స్పష్టం చేశారు. రాగల నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో ఎలాంటి తుపాన్లూ వచ్చే అవకాశం లేదన్నారు. ఇది తుపాన్ల సీజనే అయినా బంగాళాఖాతంలో అలాంటి వాతావరణం ఏదీ లేదని తేల్చి చెప్పారు. శుక్రవారానికి ఇండో చైనా సముద్రంలో అల్పపీడనం ఒకటి ఉందని.. అది బంగాళాఖాతానికి చాలా దూరంగా ఉందని, ఒక వేళ ఇది బలపడినా మన వైపునకు రాదని, బర్మా దిశగా పోతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Leave a Comment