వీరులారా.. వందనం..

18– అమరుల త్యాగాలు తెలుసుకుని కన్నీటిపర్యంతమైన కలెక్టర్
– వారి కుటుంబాలను గుండెలకు హత్తుకుని ఓదార్పు
– అంకితభావం, త్యాగగుణమే తెలంగాణకు బలం: స్మితా సబర్వాల్

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమం ప్రతి మలుపులోనూ ఓ వీరుని మరణం ఉంటుంది. ఓ తల్లి కన్నీటి వేదన ఉంటుంది. గమ్యం ముద్దాడే వరకూ వెరవని వీరత్వం ఈ గడ్డది. ఆరిపోతున్న కొలిమికి పొరకయి నిప్పులు రాజేసిన పోరగాళ్లు.. పోలీసు లాఠీలకు.. తూటాలకు బతుకంతా పొక్కిలయినా.. బిగించిన పిడికిలి విడవని విద్యార్థి వీరులు.. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని త్యాగాలు ఈ నేల మీద జరిగాయి. 60 ఏళ్ల ఉద్యమం తనకుతాను హింసించబడిందే కాని, ఎక్కడా హింసకు పాల్పడ లేదు. ‘ప్రత్యేక’ ఆకాంక్ష కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న చరిత్ర ఇక్కడి బిడ్డలది.

‘తెలంగాణ కోసం రాజీనామా చేసిన నేతలందరినీ గెలిపిస్తే.. ‘నీకు ప్రాణాలు అర్పించుకుంటా తల్లీ’ అంటూ కట్టమైసమ్మ ఆలయం ఎదుట ఎదుట ఆత్మార్పణం చేసుకున్న విద్యార్థి బసంత్‌పూర్ ఇషాంత్‌రెడ్డి.. ‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం నా చావుతో కళ్లు తెరవాలంటూ’ పురుగుల మందు తాగిన చింతకింది మురళి… తెలంగాణ ఉద్యమ సమయంతో కేసీఆర్ అరెస్టుకు కలత చెంది ఆత్మహత్య చేసుకున్న మునుగూరి శ్రీకాంత్.. ఇంకా మోదుగపూల వనంలో రాలిన పువ్వులెన్నో.. ఇలాంటి వీరులగన్న తల్లులకే కాదు..! వాళ్ల త్యాగాలు విన్న ఏ తల్లికైనా గుండె బరువెక్కుతుంది.

తెలంగాణ ఆవిర్భావ సంబురాల్లోనూ ఆదే దృశ్యం పునరావృతమైంది.  తెలంగాణ అమరవీరుల సాహసాలను, త్యాగాలను విని కలెక్టర్ స్మితా సబర్వాల్ కన్నీళ్లు పెట్టారు. అమరవీరుల  తల్లిదండ్రులను గుండెలకు హత్తుకున్నారు. వారిని ఓదార్చారు. ప్రభుత్వం అండంగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సోమవారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన అమర వీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.‘ సంఘటిత శక్తి, చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని, త్యాగ గుణాన్ని, ప్రదర్శించే మానవ సమాజం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక బలం’ అని ఈ సందర్భంగా కలెక్టర్  వ్యాఖ్యానించారు.

Leave a Comment