వెండితెరపై అచ్చతెలుగు నటుడు

నా రూటే.. సెపరేటు.. అంటూ తనదైన స్టైల్లో మూడున్నర దశాబ్దాలుగా తెలుగుప్రేక్షకులను అలరిస్తున్న నటుడు మంచు మోహన్‌బాబు. ప్రతిభ, శ్రమ కలగలిసి ఉండడంతో మోహన్‌బాబుకు అవకాశాలు ఎదురొచ్చాయి. భక్తవత్సలాన్ని మోహన్‌బాబుగా మార్చిన గురువు దాసరి నారాయణరావు అండదొరికింది. దాసరి తీసిన ‘స్వర్గం-నరకం’ సినిమాలో మోహన్‌బాబుకు ప్రధాన పాత్ర దొరికింది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు ఆయనకు. అప్పటి సినిమాల్లో విలన్‌ అంటే కాస్త సీరియస్‌గానే కనిపించేవాడు. దానికి భిన్నంగా కామెడీని జోడిస్తూ విలనీ చేసిన మోహన్‌బాబుని ప్రేక్షకులు మెచ్చారు. కామెడీ విలన్‌గా, క్యారక్టర్‌ నటుడిగా మోహన్‌బాబు కొత్తపోకడలు జనాలకు నచ్చాయి. దానికి ఆయన కంఠం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్ని రకాల పాత్రలను అవలీలగా చేస్తూ, హీరో పాత్రలు మొదలు పెట్టాడు మోహన్‌బాబు. తన గురువు దాసరి నారాయణరావు తీసిన కేటుగాడు సినిమాతో ఆయన నెగిటివ్‌ హీరోగా అవతార మెత్తాడు. తర్వాత ప్రతిజ్ఞ చిత్రం ద్వారా పాజిటివ్‌ హీరోగా ముందుకు వచ్చాడు. మోహన్‌బాబు స్వీయనిర్మాణంలో నటించిన సినిమాలు కూడా సూపర్‌ హిట్‌ సాధించాయి. అసెంబ్లీరౌడి, రౌడిగారి పెళ్ళం, బ్రహ్మ వంటి సినిమాలు ఆడియన్స్‌ను అలరించాయి. విలక్షణ పాత్రల నటుడిగా అరుదైన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు మోహన్‌బాబు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని పసిగట్టే వారికి దగ్గరయ్యాడు. కొద్దికాలంలోనే మళ్ళీ విలన్‌గా పాతరూపంతో వచ్చాడు. తర్వాత కొన్ని కామిడీ పాత్రలు కూడా చేశాడు. హీరో పాత్రలు ధరించడానికి అన్ని అర్హతలున్న మోహన్‌బాబు పట్టుదలతో మరో ప్రయత్నం చేశాడు. అదే ‘అల్లుడుగారు’ సినిమా. ఈమూవీ బాక్సాఫీసు బద్దలు కొట్టింది. అల్లుడుగారు తర్వాత మోహన్‌బాబు సినిమాలు వరుసగా ఐదు సూపర్‌ హిట్‌ సాధించాయి. దీంతో కమర్షియల్‌గా అందరికి మోహన్‌బాబు  ‘కలెక్షన్‌కింగ్‌’ అయ్యాడు. తన అభిమాననటుడు, అన్నగారు ఎన్టీఆర్‌తో ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రాన్ని నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక మోహన్‌బాబు కెరీర్‌లో పెదరాయుడు ఓ సంచలనం. అప్పట్లో 40 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ మూవీలో పెదరాయుడిగా మోహన్‌బాబు నటనకు ప్రేక్షకులు హ్యాట్సాప్‌ చెప్పారు. తనయుడు మనోజ్‌తో మోహన్‌బాబు ఇటీవల నటించిన చిత్రం ‘ఝుమ్మందినాదం’. కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాలో తండ్రికొడుకుల యాక్టింగ్‌ ఆడియన్స్‌ను తెగ అలరించింది. ఇటీవల మంచు ప్యామిలీ స్టార్లంతా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మోహన్ బాబు చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో నటించడంతో పాటు తనయులు విష్ణు, మనోజ్ నటించారు. ఈ మూవీ ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్ టైన్ చేసింది. వివాదాలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘రౌడీ’. మోహన్ బాబు -వర్మ కాంబినేషన్ ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో తనయుడు విష్ణుతో కలిసి నటించాడు మోహన్ బాబు. త్వరలో ‘యమలీల-2’తో యమధర్మరాజుగా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారాయన. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా, నిర్మాతగా, విద్యా సంస్థల అధినేతగా..  అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయకేతనం ఎగుర వేసిన ప్రతిభాశాలి.

Leave a Comment