శింబుపై సరదాగానే కామెంట్ చేశా

Simbuశింబుపై సరదాగానే కామెంట్ చేశానని దర్శకురాలు, సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ఉంటుందని నటుడు శింబు పేర్కొనడంతో వీరి మధ్య జరుగుతున్న గొడవ సమసిపోయింది. ఇంతకీ వీరి మధ్య గొడవేమిటన్నదేగా మీ ప్రశ్న. శింబు, సౌందర్య రజనీకాంత్ బాల్య స్నేహితులు. వీరిద్దరూ ఇటీవల ఒకరిపై ఒకరు ఇంటర్నెట్‌లో కామెంట్స్ గుప్పించుకున్నారు. ముఖ్యంగా కోచ్చడయాన్ చిత్రం చూసిన శింబు ఇంటర్నెట్‌లో పేర్కొంటూ చిత్రం బాగుంది దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌కు అభినందనలు అని అన్నారు.
 
 చిత్రంలోని గ్రాఫిక్స్ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలకు దీటుగా లేకపోయినా ఆమె ప్రయత్నం భేష్ అని పేర్కొన్నారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపిన సౌందర్య రజనీకాంత్ ఇంటర్నెట్‌లో పేర్కొంటూ, తాను ఒక పత్రికా విలేకరినయితే శింబు ఇకపై పాడటాన్ని నిలిపి వేయాలని చెబుతానన్నారు. దీనికి శింబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌పై తిట్లపురాణంతో దండెత్తారు. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న శింబు పరిస్థితి చెయ్యిదాటుతోందని భావించి రంగంలోకి దిగారు.
 
 విమర్శించే హక్కు, భావ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆమె తన స్నేహితురాలేనని విజ్ఞప్తి చేశారు. ఇటు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ కూడా శింబు తనకు చిన్ననాటి స్నేహితుడని అందుకే సరదాగా కామెంట్ చేశానని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. దీంతో వీరి మధ్య గొడవకు తెరపడింది.

Leave a Comment