సిగరెట్‌పై రూ. 3.50 వడ్డన!

* బీడీ పరిశ్రమకు రాయితీలన్నీ కట్
బడ్జెట్ పై ఆరోగ్యమంత్రి సూచనలు

 
న్యూఢిల్లీ: పొగాకు వినియోగంతో ఆరోగ్యపరంగా, సామాజికపరంగా కలిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒక్కో సిగరెట్‌పై పన్నును మూడున్నర రూపొయల చొప్పన పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సూచించారు. సిగరెట్ల వినియోగాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకోవాలంటూ ఆయన గురువారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. వచ్చే నెల్లో సాధారణ బడ్జెట్ రాబోతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖరాశారు. ధూమపానాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా, బీడీ పరిశ్రమకు ఇచ్చే పన్ను మినహాయింపునకు కూడా స్వస్తి చెప్పాలన్నారు.
 
 దూమపానం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన దష్ర్పభావం చూపుతోందని, ప్రతియేటా కోటిన్నరమంది పేదలుగా మారుతున్నారని హర్షవర్దన్ తెలిపారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌లో ఒక్కో సిగరెట్‌పై మూడున్నర రూపాయల చొప్పున పన్ను పెంచాలని సూచించారు. ఈ ప్రతిపాదనలను అమలుచేస్తే 30లక్షలమందిపైగా ధూమపానం మానేస్తారని, భారీగా పెంచే పన్నుతో ఖజానాకు రూ.3,800కోట్ల ఆదాయం వస్తుందన్నారు. పన్ను రాయితీలు బీడీ పరిశ్రమ విస్తృతికి ఉపయోగపడ్డాయే తప్ప, బీడీ కార్మికుల పరిస్థితి మాత్రం క్షీణించిందని చెప్పారు.

Leave a Comment