సినిమా రివ్యూ: ఉలవచారు బిర్యాని

5నటీనటులు: ప్రకాశ్ రాజ్, స్నేహ, తేజూస్, సంయుక్త, ఎంఎస్ నారాయణ, బ్రహ్మజీ, ఊర్వశి
నిర్మాత, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రకాశ్ రాజ్
మ్యూజిక్: ఇళయరాజా
కెమెరా: ప్రీతా
ప్లస్ పాయంట్స్:
కొంతలో కొంత ఇళయరాజా మ్యూజిక్, ప్రీతా ఫోటోగ్రఫి
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
విభిన్న పాత్రలతో సినీ అభిమానులను ఆకట్టుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ ‘ధోని’ చిత్రం తర్వాత మరో రీమేక్ ‘ఉలవచారు బిర్యాని’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2011లో మలయాళంలో విడుదలై విజయం సాధించిన కామెడీ చిత్రం ‘సాల్డ్ అండ్ పెప్పర్’ అనే చిత్రం ఆధారంగా ‘ఉలవచారు బిర్యాని చిత్రాన్ని స్యయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. చిత్ర విడుదలకు ముందే టీజర్లు, పాటలతో అంచనాలను పెంచిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం ప్రేక్షకుల అభిరుచికి తగినట్టే ఉందా అనే అంశాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కాళిదాసు( ప్రకాశ్ రాజ్) ఓ పెళ్లికాని ప్రసాద్. ఆయన పురావస్తుశాఖ(అర్కియాలజి) శాఖలో పనిచేసే అధికారి. గౌరీ (స్నేహ) మధ్యవయస్సు వచ్చినా..కుజదోషంగా కారణంగా పెళ్లికాని ఓ సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్. మోబైల్ రాంగ్ కాల్ తో అనుకోకుండా కలిసిన కాళిదాసు, గౌరీలు ఒకరికి మరొకరు తెలియకుండానే దగ్గరవుతారు. ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉండటంతో కాళిదాసు, గౌరీలు కలుసుకోవాలనుకుంటారు. వీరిద్దరీ కథలో కాళిదాసు మేనల్లుడు నవీన్ (తేజూస్), గౌరీ స్నేహితురాలు మేఘన (సంయుక్త హోర్నాడ్)లు ప్రవేశిస్తారు.  వీరిద్దరి కథలో నవీన్, గౌరీలు ఎందుకు ప్రవేశించారు;  కాళిదాసు, గౌరీలు కలుసుకున్నారా? కలుసుకోవడానికి మధ్య జరిగిన సంఘటనలు ఏంటీ? లేటు వయసులో చిగురించిన ప్రేమతో  వారిద్దరూ ఒక్కటయ్యారా అనే ప్రశ్నలకు సమాధానమే ‘ఉలవచారు బిర్యాని’ సినిమా.
నటీనటుల ఫెర్మార్మెన్స్:
బ్రహ్మచారి పాత్రలో కాళిదాసుగా ప్రకాశ్ రాజ్, గౌరిగా స్నేహలు నటించారు. విభిన్నమైన పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్ కు కాళిదాసు పాత్ర కొత్తేమి కాదు. కాళిదాసు పాత్ర ప్రకాశ్ రాజ్ స్థాయికి సరిపడేంత రేంజ్ లో లేకపోవడం అభిమానుల్లో ఆసక్తిని కలిగించలేకపోయింది. కాళిదాసు, గౌరీ పాత్రలు క్యారెక్టరైజేషన్ గొప్పగా లేకపోవడంతో వారిద్దరికి కూడా వారి సత్తాను ప్రదర్శించాల్సిన స్కోప్ లేకుండా పోయింది. కథలో వేగం, ఉద్వేగం లేకపోవడంతో మొదటి భాగంలోనే ప్రేక్షకుడికి విషయం లేదని అంశం బోధపడుతుంది. దీనికి తోడు రెండవ భాగం కూడా సాగదీయడంతో ఓ దశలో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నటించిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఊర్వశి, ఎంఎస్ నారాయణ, బ్రహ్మజీ, దేవయానిల పాత్రల ప్రాధాన్యత కూడా అంతంతమాత్రమే.
టెక్నిషియన్స్ పనితీరు:
కథలో పస లేకున్నా ఫోటోగ్రఫీతో ప్రీతా ఆకట్టుకున్నారు.  ఇళయరాజా సంగీతం కూడా ఈ చిత్రంపై ఆసక్తిని కలిగించలేకపోయింది. ఫీల్ ఉన్న పాటల్ని ఇళయరాజా అందించినప్పటికి.. చిత్రీకరణ విషయంలో తేలిపోయాయనే చెప్పవచ్చు. ప్రతిభావంతుడైన నటుడిగా ప్రేక్షకులు హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రకాశ్ రాజ్ ‘ఉలవచారు బిర్యాని’ నిర్మాత, దర్శకుడిగా ప్రకాశ్ రాజ్ సినీ అభిమానులను మెప్పించలేకపోయారు. కథలో క్లారిటీ లేకపోవడం, కాళిదాసు, గౌరీల, నవీన్, మేఘనల మధ్య ప్రేమ కథలకు సరియైన న్యాయం చేయలేకపోవడం, ప్రేమ కథలో ఫీల్ లోపించడం, గిరిజన సామాజిక అంశాన్ని ప్రేమ కథలో జొప్పించడానికి చేసిన ప్రయత్నాలు చిత్ర విజయానికి అనుకూలంగా మారలేకపోయాయి.  ప్రకాశ్ రాజ్ నుంచి భారీగా ఆశించి… మంచి ఆకలితో  థియేటర్ కెళ్లిన ప్రేక్షకుడికి రుచి లేని ‘ఉలవచారు బిర్యాని’ని వడ్డించారని చెప్పవచ్చు.

Leave a Comment