సివిల్స్-2014.. సుసాధ్యమే

బీఏ/ బీకాం/ బీఎస్సీ పూర్తిచేశారా? మీరు చదివిన సాధారణ డిగ్రీలకు అత్యుత్తమ ఉద్యోగాలు ఎలా వస్తాయని దిగులు చెందుతున్నారా? మీ కోసమే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ – 2014 ప్రకటనను విడుదల చేసింది. వయోపరిమితిని, ప్రయత్నాల సంఖ్యను పెంచడం సానుకూలాంశం. ఇందులో విజయం సాధించాలంటే.. కావాల్సిందల్లా..  మానసిక సన్నద్ధత, విషయ పరిజ్ఞానం, వ్యక్తిత్వ సామర్థ్యం. ఇవి ఉంటే చాలు.. మీరు కూడా ఒక జిల్లాకు కలెక్టర్ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పీ) కావొచ్చు, లేదంటే విదేశాల్లో మనదేశం తరపున ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిగా సేవలందించొచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్.. ఇంటర్వ్యూలనే మూడు దశల్లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో మీ ప్రతిభను చూపే సామర్థ్యాన్ని పెంపొందించుకోండి. నిండైన ఆత్మవిశ్వాసం, సాధించగలమనే తపన, ఓటములకు బెదరని వ్యక్తిత్వం, పరిపూర్ణ విషయ పరిజ్ఞానం, తప్పులను త్వరగా సరిదిద్దుకోగల లక్షణాలను సొంతం చేసుకుంటే సివిల్స్సుసాధ్యమే అంటున్నారు నిపుణులు. సివిల్స్ – 2014లో లక్ష్య సాధనకు నిపుణుల సూచనలు.. సలహాలు..

అర్హతలు.. దరఖాస్తు విధానం
 
సివిల్ సర్వీసెస్ పరీక్షను ఎవరు నిర్వహిస్తారు? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది?
జాతీయస్థాయిలో హోదాపరంగా ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి 20కిపైగా సర్వీసుల్లో నియామకానికి ప్రతి ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తోంది. ఈ ఏడాది ప్రకటన మే 31న వెలువడింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 30. ఆగస్టు 24న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా ఎస్‌బీఐ శాఖలో రూ.100 ఫీజు చెల్లించాలి లేదా ఎస్‌బీఐ/ఎస్‌బీఐ గ్రూప్  (స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్)ల్లో నెట్ బ్యాంకింగ్ /డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఫీజు చెల్లించొచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, శారీరక వికలాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ ఏడాది మొత్తం పోస్టుల సంఖ్య 1291.
 
సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హతలేంటి?
ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసినవారు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు అర్హులు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. వీరు మెయిన్స్ నాటికి తమ ఉత్తీర్ణతా సర్టిఫికెట్లు చూపాలి. వయోపరిమితి నిబంధన కూడా ఉంది. ఆగస్టు 1, 2014 నాటికి అన్ని వర్గాల అభ్యర్థులకు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు.. ఓబీసీలకు 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 37 ఏళ్లు. అంధులు,  బధిరులు, శారీరక వికలాంగులకు గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు.
 
సివిల్ సర్వీసెస్ పరీక్షను ఎన్నిసార్లు రాయొచ్చు? పీహెచ్ అభ్యర్థులకు ఎక్కువసార్లు రాసుకునే వెసులుబాటు ఉందా?
గతేడాది వరకు సివిల్స్ పరీక్షలను జనరల్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా నాలుగుసార్లు మాత్రమే రాసుకునే వీలుండేది. ఈ ఏడాది నుంచి దాన్ని ఆరుసార్లకు పెంచారు. ఓబీసీలకు ఇప్పటివరకు ఏడుసార్లు సివిల్స్ రాసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది నుంచి తొమ్మిదిసార్లు రాసుకునే వీలు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలు, పీహెచ్ (అంధ, బధిర, వికలాంగులు) గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. జనరల్ కేటగిరీకి చెందిన పీహెచ్ అభ్యర్థులు తొమ్మిదిసార్లు మాత్రమే రాసుకునే వీలుంది.
 
దూరవిద్యా విధానం/ఓపెన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీ పూర్తిచేసినవారు సివిల్స్ పరీక్ష రాసేందుకు అర్హులేనా?
వివిధ యూనివర్సిటీలు దూరవిద్యా విధానం ద్వారా అందించే బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైనవారు సివిల్స్ రాసేందుకు అర్హులే. అయితే ఆ కోర్సుకు సంబంధిత అధీకృత సంస్థల (యూజీసీ/డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో/ఏఐసీటీఈ తదితర) గుర్తింపు ఉండాలి.
 
సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఏయే సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేస్తారు?
సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా మొత్తం 23 సర్వీసుల్లో ఉద్యోగులను ఎంపిక చేస్తారు. వాటి వివరాలు..
 1.     ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
 2.     ఇండియన్ ఫారెన్ సర్వీస్
 3.     ఇండియన్ పోలీస్ సర్వీస్
 4.     ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్-ఏ
 5.     ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ – గ్రూప్-ఏ
 6.     ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్), గ్రూప్-ఏ
 7.     ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ
 8.     ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ), గ్రూప్-ఏ
 9.     ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, గ్రూప్-ఏ (అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్)
 10.     ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్-ఏ
 11.     ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ
 12.     ఇండియన్ ైరె ల్వే ట్రాఫిక్ సర్వీస్, గ్రూప్-ఏ
 13.     ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, గ్రూప్-ఏ
 14.     ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ – గ్రూప్-ఏ
 15.     పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ – గ్రూప్-ఏ
 16.     ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్-ఏ
 17. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(జూనియర్ గ్రేడ్), గ్రూప్-ఏ
 18.     ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్-ఏ, (గ్రేడ్-3)
 19.     ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్-ఏ,
 20.     ఆర్మ్‌డ్‌ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్-బి (సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్)
 21.     ఢిల్లీ, అండమాన్-నికోబార్ ఐస్‌లాండ్స్, లక్షద్వీప్, డామ న్-డయ్యూ, దాద్రానగర్ హవేలి సివిల్ సర్వీస్-గ్రూప్-బి
 22.     ఢిల్లీ, అండమాన్-నికోబార్, లక్షద్వీప్, డామ న్-డయ్యూ, దాద్రానగర్ హవేలి పోలీస్ సర్వీస్-గ్రూప్-బి
 23.     పాండిచ్చేరి సివిల్ సర్వీస్ – గ్రూప్-బి
 
దరఖాస్తు చేసుకోవడమెలా?
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా www.upsconline.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో ‘ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ’ అనే లింక్  కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్, చివరి తేదీ, పార్ట్-1, పార్ట్-2 రిజిస్ట్రేషన్స్ కనిపిస్తాయి. ముందుగా పార్ట్-1 రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, జాతీయత, వివాహ స్థితి, విద్యార్హతలు, చిరునామా వంటివి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా పూర్తి చేయాలి. మీ పేరు, పుట్టినతేదీ పదోతరగతి సర్టిఫికెట్‌లో ఎలా ఉందో అలానే రాయాలి. తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే మరిన్ని వివరాలు వస్తాయి. వీటిని కూడా పూర్తి చేస్తే పార్ట్-1 రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీ వివరాలు అన్నీ సరిచూసుకున్నాక ‘యూ అగ్రి’ బటన్ క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ, పుట్టినతేదీతో పార్ట్-2 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో ముందుగా నిర్దేశించిన సైజ్‌లో మీ ఫొటో, సంతకం స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఫొటో, సంతకం అప్‌లోడ్ చేశాక మిగిలిన వివరాలు నింపాలి.
 
సివిల్స్‌కు ఎంపికైతే పదోన్నతులు ఎలా ఉంటాయి?
ఐఏఎస్‌కు ఎంపికైనవారు మొదట అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి వరుసగా కలెక్టర్/డిప్యూటీ కమిషనర్/డిప్యూటీ సెక్రటరీ/డిప్యూటీ డెరైక్టర్; కలెక్టర్/డిప్యూటీ కమిషనర్/అడిషనల్ సెక్రటరీ/జాయింట్ సెక్రటరీ/డెరైక్టర్;  సెక్రటరీ/కమిషనర్ అండ్ సెక్రటరీ; ప్రిన్సిపల్ సెక్రటరీ/ఫైనాన్షియల్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ/చైర్మన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ హోదాలకు చేరుకుంటారు.
 
ఐపీఎస్‌కు ఎంపికైనవారు వరుస క్రమంలో.. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్/సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ ఆఫ్ స్టేట్) చేరుకుంటారు.
 
ఇండియన్ రెవెన్యూ సర్వీస్..
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, డెరైక్టర్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్/బోర్డ్ అండ్ ట్రిబ్యునల్ మెంబర్స్.
 
 పరీక్ష విధానం.. ప్రిపరేషన్ ప్లాన్
 
సివిల్స్ పరీక్ష విధానాన్ని వివరించండి? ఎన్ని మార్కులకు ఉంటుంది? ఎన్ని పేపర్లు ఉంటాయి?
 సివిల్స్ ఎంపిక మూడు దశలుగా ఉంటుంది. అవి.. 1. ప్రిలిమినరీ, 2. మెయిన్స్ 3. ఇంటర్వ్యూ.
 ప్రిలిమ్స్: సివిల్స్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులుంటాయి. పేపర్-1లో 100 ప్రశ్నలు, పేపర్-2లో 85 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత విధిస్తారు. ఒక్కో పేపర్ పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు (120 నిమిషాలు). ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులను చివరి ఎంపికలో పరిగణించరు.
 
మెయిన్స్: అందుబాటులో ఉన్న పోస్టుల్లో.. ఒక్కో పోస్టుకు 12 లేదా 13 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్ల (ఇంగ్లిష్ మినహాయించి)ను తెలుగు మాధ్యమంలో కూడా రాసుకోవచ్చు. ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లిష్/హిందీల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ కన్వెన్షనల్ (వ్యాస రూప) విధానంలో ఉంటాయి.
 
మెయిన్స్ పరీక్ష విధానం: ఇందులో 300 మార్కులకు పేపర్-ఏ ఉంటుంది. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగును ఎంచుకుని రాయొచ్చు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. సంబంధిత మాతృభాషల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
 
పేపర్-బి: ఇంగ్లిష్ (300 మార్కులు). ఇంగ్లిష్‌లో అభ్యర్థికి సాధారణ పరిజ్ఞానం ఉందో, లేదో పరిశీలించడం ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం. పేపర్-ఏ, పేపర్-బి రెండు పదో తరగతి/మెట్రిక్యులేషన్ స్థాయిలో ఉంటాయి. వీటి మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. అయితే అభ్యర్థులు పేపర్-ఏలో 30 శాతం, పేపర్-బిలో 25 శాతం మార్కులు సాధించాలి.
 
మౌఖిక పరీక్ష: మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని పోస్టుకు ఇద్దరు చొప్పున మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులుంటాయి. అంటే మెయిన్స్, ఇంటర్వ్యూలకు కలిపి మొత్తం మార్కులు 2025. ఈ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
 
సివిల్స్ ప్రిలిమ్స్‌లో పేపర్-1లో ఏయే అంశాలుంటాయి?
ప్రిలిమ్స్ పేపర్-1.. 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఇందులో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం, ఇండియన్-వరల్డ్ జాగ్రఫీ, భారతదేశ రాజకీయ వ్యవస్థ – పాలన – రాజ్యాంగం, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, హక్కుల వివాదాలు, ఆర్థిక- సామాజిక అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి, పేదరికం, సామాజిక రంగం, పర్యావరణం, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పు, జనరల్ సైన్స్ మొదలైన అంశాలు ఉంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ ఎనిమిదో తరగతి- 12వ తరగతి పాఠ్యపుస్తకాలు, హిందూ దినపత్రిక, ఏదైనా ఒక తెలుగు దినపత్రికను ప్రతి రోజూ చదవాలి.
 
ప్రిలిమ్స్ పేపర్-2లో ఏయే అంశాలుంటాయి? ఎలా ప్రిపేర్ కావాలి?
ప్రిలిమ్స్ పేపర్-2 కూడా 200 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్‌ను సీశాట్ అంటారు. పరీక్ష వ్యవధి: రెండు గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఇందులో కాంప్రహెన్షన్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఎనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ (నంబర్స్ – రిలేషన్స్), డేటా ఇంటర్‌ప్రిటేషన్ (చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్, డేటా సఫిషియన్సీ), ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ మొదలైన అంశాలు ఉంటాయి. ఇందులో బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ పదో తరగతి స్థాయిలో ఉంటాయి. బ్యాంక్ పరీక్షల మెటీరియల్, క్యాట్, శాట్ వంటి పరీక్షల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఆర్‌ఎస్ అగర్వాల్ రాసిన ఎనలిటికల్ ఎబిలిటీ కూడా ఉపయోగపడుతుంది.

మెయిన్స్‌లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతమేర ఉంటుందో తెలపండి?
మారిన సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతో ఉంది. చాలామంది అభ్యర్థులకు సబ్జెక్ట్‌పై అవగాహన ఉన్నా ఇంగ్లిష్ రాకపోవడం వల్ల మార్కులు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన విద్యార్థులు ఈ అంశంలో వెనుకబడిపోతున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన అభ్యర్థులకు హిందీలో లేదంటే ఇంగ్లిష్‌లో మంచి పట్టు ఉంటుంది. కాబట్టి చక్కటి ఇంగ్లిష్ రావడానికి రోజూ హిందూ దినపత్రికను చదవడంతోపాటు లోక్‌సభ, రాజ్యసభ, బీబీసీ, ఎన్‌డీటీవీ వంటి న్యూస్ చానెళ్లను రోజూ అరగంట సేపైనా చూడాలి. వీటిల్లో మంచి ఉచ్ఛారణతో కూడిన ఇంగ్లిష్‌ను వినొచ్చు. అంతేకాకుండా వివిధ అంశాలు చర్చకు వస్తుంటాయి. ప్రిపరేషన్ కోణంలోనూ ఉపయుక్తంగా ఉంటుంది.
 
సివిల్స్ మెయిన్స్ జనరల్ ఎస్సేలో ఏయే అంశాలు ఉంటాయి?
దీనికి ప్రత్యేకించి సిలబస్ అంటూ లేదు. చాలామంది అభ్యర్థులు ప్రస్తుత వర్తమాన వ్యవహారాలపై సిద్ధం అవుతుంటారు. ఇది సరికాదు. సామాజిక, ఆర్థిక, మత, సాంఘిక, ఆధ్యాత్మికం ఇలా ఏ అంశంపైనైనా ప్రశ్నలు అడగొచ్చు. ఏ అంశం ఇచ్చినా చక్కని విశ్లేషణ, నిర్మాణం, సమస్యను విశ్లేషించగలగడం, రచనా నైపుణ్యం అభ్యర్థికి ఉండాలి. రైటింగ్ స్కిల్స్ కూడా తప్పనిసరి.
 
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్-1లో ఏయే అంశాలుంటాయి?
భారతీయ సంస్కృతి, వారసత్వం, ప్రపంచ చరిత్ర, భూగోళ శాస్త్రం వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రాచీన కాలం నుంచి ఆధునిక భారతదేశంలో సాహిత్యం, నిర్మాణం, సంస్కృతి, 18వ శతాబ్దం మధ్య నుంచి ఇప్పటివరకు ప్రముఖ సంఘటనలు, వ్యక్తులు, వివాదాలు తదితర అంశాలు, భారత స్వాతంత్య్రోద్యమంలో ముఖ్య దశలు-ఉద్యమాలు-వ్యక్తులు, పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాలు, సామ్రాజ్యవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారి విధానాలు, భారతీయ సమాజం, భిన్నత్వంలో ఏకత్వం, పట్టణీకరణ, భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావం, పేదరికం, ప్రాంతీయవాదం, లౌకికవాదం, సాధికారత, భూకంపాలు, సునామీ, తుపానులు తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి పాఠ్యపుస్తకాలు, హిందూ దినపత్రిక, యోజన, కురుక్షేత్ర వంటివి చదవాలి.
 
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్-2లో ఏయే అంశాలుంటాయి?
జీఎస్ పేపర్-2 అంతా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ పేపర్-2 అని చెప్పొచ్చు. జీఎస్-2లో భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల నిర్మాణం, విధులు, కేంద్ర, రాష్ట్రాల విధులు – బాధ్యతలు, సమాఖ్య వ్యవస్థలో సవాళ్లు-సమస్యలు, ప్రజాప్రాతినిధ్య చట్టం, రాజ్యాంగ సంస్థలు – నియామకాలు-అధికారాలు-విధులు-బాధ్యతలు, భారత్-పొరుగు దేశాలతో సంబంధాలు, పేదరికం-ఆకలి సమస్యలు, భారత్ – ప్రపంచ దేశాల గ్రూపుల్లో (సార్క్, నామ్, జీ-20 తదితర) సభ్యత్వం , ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలపై ప్రశ్నలుంటాయి. ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్- రమేశ్ అరోరా, ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ – డీడీ బసు, దిన పత్రికలు, మ్యాగజైన్లు చదవాలి. టీవీ చానెళ్లలో చర్చలు చూడాలి.
 
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్-3లో ఏయే అంశాలుంటాయి?
జీఎస్-3లో సాంకేతికత, ఆర్థికాభివృద్ధి, జీవవైవిధ్యం, పర్యావరణం, రక్షణ, విపత్తు నిర్వహణ వంటి అంశాలుంటాయి. జీఎస్ పేపర్-3కి వివిధ దినపత్రికలు, ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, యోజన, ఎకనమిక్ సర్వే, కురుక్షేత్ర వంటివి చదవాలి. ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలంటూ లేవు. ది ఎకానమిస్ట్ (బ్రిటన్ నుంచి వెలువడుతుంది)లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రశ్నలుంటున్నాయి. హిందూలో ప్రతి గురువారం ఎస్ అండ్ టీపై వచ్చే అంశాలు, సెమినార్ అనే మాసపత్రిక ఉపయుక్తం. అన్ని ప్రశ్నలూ.. ప్రస్తుత సమస్యలకు అన్వయించడం, అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటున్నాయి. ఉదాహరణకు ఐటీ దేశభద్రతకు ముప్పు కలిగిస్తుందా?.
 
సివిల్స్ మెయిన్స్ జీఎస్-4కు ఎలా సిద్ధమవ్వాలి?
జీఎస్‌లోని నాలుగు పేపర్‌లలో ఇదే సులువైనదని చెప్పొచ్చు. కేస్ స్టడీస్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా సంబంధిత సమస్యను నీవైతే ఎలా ఎదుర్కొంటావు? అనే కోణంలో ప్రశ్నలుంటాయి. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ – జి. సుబ్బారావు, వీఎన్ రాయ్, యాక్సెస్ పబ్లిషింగ్ బుక్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ వ్యాల్యూస్ – రమేశ్ కె.అరోరా ఉపయుక్తం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నవారికి ఈ పేపర్ సులువుగా ఉంటుంది.
 
సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్‌కు రెండింటి ఉమ్మడి ప్రిపరేషన్‌ను వివరించండి ?
సివిల్స్‌కు ప్రకటన వెలువడిన నాటి నుంచి కూడా మెయిన్స్ కోణంలోనే ప్రిపరేషన్ ఉండాలి. చాలామంది ముందు ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతారు. ఆ తర్వాత మెయిన్స్ సంగతి చూద్దాంలే అనే నిర్లిప్తతతో ఉంటారు. ఇది సరికాదు. ముందు నుంచీ ప్రిలిమ్స్‌తోపాటే మెయిన్స్‌కు కూడా సిద్ధమవ్వాలి. ప్రిలిమ్స్‌లోని సీశాట్‌ను ప్రత్యేకంగా చదువుకోవాలి. మెయిన్స్ పూర్తయ్యాక ఇంటర్వ్యూ గురించి ఆలోచించాలి.
 
 ఎంపికలో ప్రభావం చూపించే మెయిన్స్ ప్రధాన పేపర్లు
 పేపర్-1 (ఎస్సే) మార్కులు: 250
 పేపర్-2 (జనరల్ స్టడీస్-1 (ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ)    ) – మార్కులు: 250    
 పేపర్-3 (జనరల్ స్టడీస్-2 (పాలన, రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు) – మార్కులు: 250
 పేపర్-4 (జనరల్ స్టడీస్-3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్‌మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్)) – మార్కులు: 250
 పేపర్-5 (జనరల్ స్టడీస్-4 (ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్))- మార్కులు: 250.
 పేపర్-6 (ఆప్షనల్ సబ్జెక్ట్ – పేపర్-1) – మార్కులు: 250
 పేపర్-7 (ఆప్షనల్ సబ్జెక్ట్ – పేపర్-2) – మార్కులు: 250
 
 కోచింగ్ పాత్ర.. టైమ్ మేనేజ్‌మెంట్
 
పాపులర్ ఆప్షన్స్ ఏవి?
మెయిన్స్ పరీక్షల్లో ఆప్షనల్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులుంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి మూడు గంటలు. జాతీయస్థాయిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బాగా పాపులర్ అని చెప్పొచ్చు. ఇవేకాకుండా హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ, ఆంత్రోపాలజీ వంటి సబ్జెక్టులను ఎక్కువమంది విద్యార్థులు ఎంచుకుంటున్నారు. కోచింగ్ సదుపాయం అందుబాటులో ఉండటంతోపాటు కొన్ని సబ్జెక్టుల సిలబస్ తక్కువ ఉండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఆయా రాష్ట్రాల విద్యార్థులు తమ మాతృభాషల సాహిత్యాన్ని ఎంచుకుని కూడా పరీక్షలు రాస్తున్నారు. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగు సాహిత్యాన్ని ఎంచుకుంటున్నారు. ఆప్షనల్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే అన్ని అంశాలపై పట్టుండాలి. మారిన విధానంలో చాయిస్ కూడా చాలా తక్కువ ఉంది. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నలో అనేక ఉప ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రశ్నలు కూడా పరోక్షంగా ఉంటున్నాయి. థియరీ కంటే కూడా అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. సమకాలీన అంశాలు, సమస్యలపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు.
 
సివిల్స్‌కు కోచింగ్ తప్పనిసరా? కోచింగ్ పాత్ర ఏమిటి?
సివిల్స్ సాధనలో కోచింగ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. కోచింగ్ సెంటర్స్ అభ్యర్థిలో ఉన్న నైపుణ్యాలకు మెరుగులు పెడతాయని చెప్పొచ్చు. కోచింగ్ వల్ల ఏది చదవాలో.. ఏది చదవకూడదో తెలుస్తుంది. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుంది. మారిన పరీక్ష విధానంలో టైమ్ కీలకం కాబట్టి కోచింగ్ తీసుకుంటేనే మంచిది. కోచింగ్ అనేది లాంచింగ్ ప్యాడ్ లాంటిది. దీంతో పోటీకి తగ్గట్లు అభ్యర్థులు సిద్ధం కావచ్చు. ఇతర అభ్యర్థుల నుంచి ప్రేరణ, స్ఫూర్తి పొందొచ్చు. అయితే కోచింగ్ లేకపోయినా సొంత ప్రిపరేషన్‌తో విజయం సాధించినవారు కూడా ఉన్నారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు సివిల్స్ గురించి అంతగా అవగాహన లేదు. వీరు జాతీయస్థాయిలో పోటీపడాల్సి ఉంటుంది కాబట్టి కోచింగ్ అవసరమనే చెప్పాలి.
 
ఎలాంటి కోచింగ్ సెంటర్‌ను ఎంపిక చేసుకోవాలి?
కోచింగ్ సెంటర్‌ను సంస్థ బ్రాండ్ నేమ్‌ను చూసి ఎంపిక చేసుకోకూడదు. ఫ్యాక ల్టీ బేస్డ్ కోచింగ్ సెంటర్‌ను ఎంచుకోవాలి. ప్రస్తుత పరిణామాలను విశ్లేషించి, కాన్సెప్ట్ బేస్డ్ విధానంలో చెప్పగల ఫ్యాకల్టీ ఉన్న శిక్షణ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. వర్తమాన వ్యవహారాలపై అసాధారణమైన పట్టు ఉండి, ప్రస్తుత పరిణామాలకు గతాన్ని కూడా జోడించి చెప్పే ఫ్యాకల్టీ ఉన్న శిక్షణ కేంద్రం ఉత్తమం. అందులోనూ మాడ్యూల్ బేస్డ్ కోచింగ్ అందిస్తున్న సంస్థలైతే మంచిది.
 
నోట్స్ ప్రిపరేషన్‌లో ఎలాంటి మెళకువలు పాటించాలి?
ప్రస్తుతం మారిన పరీక్ష విధానంలో ప్రశ్నలన్నీ వర్తమాన వ్యవహారాలు, సమాజంలో, మీడియాలో చర్చకు వస్తున్న వివిధ అంశాలపై ఆధారపడి ఉంటున్నాయి. జనరల్ స్టడీస్‌లోని నాలుగు పేపర్లు, ఎస్సే మొత్తం అదేవిధంగా ఉంటున్నాయి. పాఠ్యపుస్తకాలు, ఇతర మెటీరియల్ అన్నీ కూడా నోట్స్ రూపంలో ఉన్నవే. అయితే వివిధ దినపత్రికలు, మ్యాగజైన్లు, పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యమైన అంశాలను సినాప్సిస్, బుల్లెట్ పాయింట్స్‌లా రాసుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడూ తాజా సమాచారంతో అప్‌డేట్ చేసుకుంటుండాలి. వీటిని వీలైనప్పుడు చదువుకోవడానికి అనుకూలంగా ఉండేటట్లు తయారుచేసుకోవాలి. వీటిని పదేపదే చదవాలి. ఇంటర్నెట్‌పై అతిగా ఆధారపడకూడదు. దీనివల్ల కాలయాపన జరుగుతుంది.
 
రీడింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి?
దినపత్రికలు, మ్యాగజైన్లు చదివేటప్పుడు ఏదైనా అంశంలోని ప్రధాన విషయాన్ని గుర్తించగలగాలి. ఆ అంశానికి సంబంధించిన ఇతర విషయాలను పాఠ్యపుస్తకాలు, రిఫరెన్స్ బుక్స్‌లో సేకరించి, ఒక చోట క్రోడీకరించుకుని చదువుకోవాలి. ఇలా చేస్తే ఆయా అంశాలపై పట్టు లభిస్తుంది.
 
ఎక్కువ మార్కులు సాధించాలంటే రాత ఎలా ఉండాలి?
అద్భుతమైన రైటింగ్ రాయలేకున్నా  ఉన్నంతలో రాసింది అర్థమయ్యేట్లుగా ఉండాలి. గొలుసుకట్టులాగా రాయకూడదు. పదాలు విడివిడిగా ఉండాలి. మారిన పరీక్ష విధానంలో చాయిస్ తగ్గిపోయింది. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అందుబాటులో ఉన్న మూడు గంటల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే రైటింగ్ ప్రాక్టీస్ తప్పనిసరి.
 
మెయిన్స్‌లో మంచి మార్కులు సాధించడం ఎలా?
ముందు ప్రశ్నను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సమాధానం సూటిగా, స్పష్టంగా రాయాలి. అవసరమైన మేరకు మాత్రమే సమాధానం ఉండాలి. పరిచయం. నిర్మాణం, ఉపోద్ఘాతం అంటూ సమయం వృథా చేయకూడదు. ప్రశ్నకు తగ్గట్టే ఆన్సర్‌ను కూడా ప్రశ్నతోనే ప్రారంభించాలి. తక్కువ పద బంధాలతో ఎక్కువ అర్థం వచ్చేలా, విశ్లేషణాత్మకంగా, ప్రభావవంతంగా రాయాలి. పాయింట్‌వైజ్ రాస్తే మంచి మార్కులు పొందొచ్చు. వాటిలో కంటెంట్, తాజా అంశాలు ఉండాలి. ప్రతి ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు కొంత ఖాళీ వదలాలి. చివరి పేజీలో రఫ్ వర్క్ మాదిరిగా జవాబు ఫ్రేమ్ వర్క్ తయారుచేసుకోవాలి. ఇలా రాస్తే గరిష్ట మార్కులు పొందొచ్చు.
     
టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ను వివరించండి?
ముందు ఇష్టం ఉన్న టాపిక్స్‌ను చదువుదాం. చివరకు కష్టమైనవి చదువుదామనుకోకూడదు. ప్రాధాన్యతల పరంగా సబ్జెక్టులను చదవాలి. 500, 200, 100, 50 పదాలు ఇలా.. సమయపరిమితిలోగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ప్రాక్టీస్ చేయాలి. ప్రతి రోజూ గంట సేపైనా చదువుకున్న అంశంపై రాస్తూ ఉండాలి. ఒక పేజీలో 150 పదాలు ఎనిమిది లేదా తొమ్మిది నిమిషాల్లో రాయగలగాలి. ఇలా రోజూ చేస్తే పరీక్ష నాటికి వేగం అలవడి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు.
 
జాబ్ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించడమెలా?
జాబ్ చేస్తూ కూడా సివిల్స్ రాసుకోవచ్చు. అయితే ఒకసారి కోచింగ్ తీసుకుని ఉంటే బాగుంటుంది. ఖాళీ సమయంలో దినపత్రికలు, వివిధ మ్యాగజైన్లు వంటివాటిని చదువుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించుకోవచ్చు. దీన్ని క్రోడీకరించుకుని, కోర్ సబ్జెక్టులకు అనుసంధానం చేసుకోవాలి.
 
అభ్యర్థులకు ఒత్తిడి సహజం? దీన్ని ఎలా అధిగమించాలి?
ఒత్తిడిని ఎదుర్కోవాలంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అపజయం ఎదురైనా విజేతలైనవారి గెలుపు పాఠాలను ఒంటబట్టించుకోవాలి. ఒకటి, రెండుసార్లు అపజయం ఎదురైనా ఈసారి విజయం మీదేనని నమ్మాలి. గత విజేతల సక్సెస్ స్టోరీలను చదివి ప్రేరణ పొందాలి. వేరేవాళ్లతో పోల్చుకుని నిరాశ చెందకూడదు. ఒత్తిడిని అధిగమించడానికి సంగీతం వినడం, మిత్రులతో చిట్‌చాట్, ఏదైనా గేమ్ ఆడుకోవడం వంటివి చేయాలి. ఎల్లవేళలా సానుకూల దృక్పథంతో ఉండాలి.
 
సివిల్స్ అభ్యర్థి మెంటల్ మేకప్ ఎలా ఉండాలి?
చాలామంది అభ్యర్థులు రోజులో 18 గంటలు లేదంటే 20 గంటలు చదివితేనే విజయం సాధిస్తామని నమ్ముతారు. ఇది సరికాదు. రోజువారీ కార్యక్రమాలను తప్పనిసరిగా చేయాలి. నడక, వ్యాయామంతోపాటు యోగా, ప్రాణాయామం వంటివి అభ్యసించాలి. అల్పాహారం, భోజనం నిర్ణీత వేళల్లోగా పూర్తిచేయాలి. అదేవిధంగా మీ ప్రిపరేషన్‌కు దోహదపడే సన్నిహిత మిత్రులను ఎంపిక చేసుకోవాలి. సివిల్స్ అంటే పరిశోధన కాదు అనే విషయాన్ని గుర్తించాలి. అనేక కెరీర్ ఆప్షన్స్‌లో ఇది కూడా ఒకటి అని భావించాలి.
 
ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే ఎలా?
ఇంటర్వ్యూలో నిజాయతీగా ఉండాలి. తెలియని విషయాలను తెలియదని చెప్పాలి. ఎక్కువ శాతం ప్రశ్నలు ఆ రోజు వరకు మీడియాలో చర్చకు వస్తున్న వివిధ అంశాలపై అడుగుతారు. కాబట్టి వర్తమాన వ్యవహారాలపై పట్టుండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సమాజంలో రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాల పట్ల సానుభూతి చూపాలి. వీరి గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ కూడా బలహీన వర్గాలసంక్షేమానికే కట్డుబడి ఉంటాయి. అదేవిధంగా బోర్డు సభ్యులతో మొండిగా వాదనకు దిగకూడదు. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. అసందర్భ ప్రశ్నలు కూడా వేసే అవకాశం ఉంది. అభ్యర్థి సమయస్ఫూర్తిని కూడా పరిశీలిస్తారు. ఉదాహరణకు ఒక అభ్యర్థిని ‘ఇక్కడకు (ఇంటర్వ్యూ ప్రదేశానికి) ఎలా చేరుకున్నావు’ అని ప్రశ్నించారు. ఆ అభ్యర్థి ఆటోలో వచ్చాను అని సమాధానమిచ్చాడు. వెంటనే బోర్డు సభ్యుడొకరు ఆటో నెంబర్ ఎంత? అని ప్రశ్నించారు? అభ్యర్థి సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయాడు. చెప్పలేకపోవడం వల్ల అభ్యర్థి అజాగ్రత్తగా ఉంటాడని ఇంటర్వ్యూ బోర్డ్ అనుకునే ప్రమాదముంది. ఆ ఆటోలో పొరపాటున అభ్యర్థి సర్టిఫికెట్లు, లగేజీ మర్చిపోతే పరిస్థితేంటి? కాబట్టి అభ్యర్థి సమయస్ఫూర్తిని కూడా సభ్యులు పరిశీలిస్తారు.
 
సివిల్స్‌కు ఎంత ఖర్చు అవుతుంది?
మన రాష్ట్రంలో ప్రధాన కోచింగ్ సెంటర్లలో లక్ష రూపాయల వరకు ఫీజు ఉంటుంది. ఢిల్లీ లాంటి నగరాల్లో లక్షన్నర రూపాయల వరకు ఉంటుంది. కోచింగ్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు శిక్షణనిస్తారు. కోచింగ్ వ్యవధి దాదాపు పది నెలలు. హాస్టల్ వసతి, భోజన ఖర్చుల కింద నెలకు మరో రూ.5000 వరకు అవుతాయి. పుస్తకాలు, ఇతర ఖర్చులు అదనం.
 
ఆర్థిక సమస్యలు ఉంటే ఎలా అధిగమించాలి?
పార్ట్‌టైం జాబ్ చేసుకుంటూ సివిల్స్‌కు సిద్ధం కావచ్చు. తద్వారా ఆర్థిక సమస్యలు అధిగమించొచ్చు. ఇప్పుడు చాలా బుక్స్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా చదువుకోవచ్చు. అంతేకాకుండా కేంద్ర గ్రంథాలయాల్లో సభ్యత్వం తీసుకుని వివిధ పుస్తకాలను అధ్యయనం చేయొచ్చు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం తరపున స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో సివిల్స్ కోసం ఉచిత కోచింగ్ ఇస్తారు. దీంతోపాటు స్టైఫండ్ కూడా అందుతుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిరుపేద అభ్యర్థులకు సహాయం అందిస్తున్నాయి.
 
 ఇన్‌పుట్స్
 గురజాల శ్రీనివాసరావు, సీనియర్ ఫ్యాకల్టీ సివిల్స్
 డా॥బి.జె.బి.కృపాదానం, సీనియర్ ఫ్యాకల్టీ సివిల్స్

Leave a Comment