సీమాంధ్రలో రికార్డుస్థాయి పోలింగ్‌

seemandhra_mapసీమాంధ్రలో ఎన్నికల పోలింగ్‌ ఉత్సాహంగానే జరుగుతోంది. యువత పెద్దయెత్తున ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుండడంతో ఓటింగ్‌ శాతం చాలా వేగంగానే పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల సమయానికి 71 శాతం పోలింగ్‌ సీమాంధ్రలో నమోదైనట్లు అధికారికంగా వెల్లడయ్యింది. ఇంకో గంట సమయం వుంది పోలింగ్‌ పూర్తవడానికి. పోలింగ్‌ పూర్తయ్యే సమయానికి లైన్‌లో వున్నవారందరికీ ఓటు వేసే అవకాశం వుంటుంది గనుక.. మొత్తంగా పోలింగ్‌ శాతం సీమాంధ్రలో రికార్డు స్థాయిలోనే నమోదయ్యే అవకాశం వుందంటూ రాజకీయ వర్గాల్లో అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వారి అంచనాలే నిజమై పోలింగ్‌ శాతం పెరిగితే, దానివల్ల లాభం ఏ పార్టీకి దక్కుతుంది.? అన్నదానిపై ఏ పార్టీ అంచనాలు ఆ పార్టీకి వున్నాయి. మొత్తంగా చూస్తే పోలింగ్‌ శాతం పెరగడం అనేది శుభ పరిణామం. అయితే చాలా చోట్ల ఓటర్లు తమ ఓట్లు లిస్టులో లేవంటూ ఆందోళనలు చేపట్టడం బాధాకరమైన విషయమే. ఈ తొలగింపు అనేది కొన్ని చోట్ల పదుల సంఖ్యలో వుంటే ఇంకొన్ని చోట్ల ఆరు వందల నుంచి వెయ్యి ఓట్ల దాకా వుండడం ఇంకా బాధ కలిగించే విషయం. నడవడానికి కాళ్ళు సహకరించుకున్నా, ఊతకర్ర సహాయంతో ఓటేయడానికి వచ్చిన వృద్ధ వికలాంగుల ఓట్లు తొలగించబడ్డంతో మండుతున్న ఎండల్లోనూ ఓటేయాలన్న వారి ఆశల మీద నీళ్ళు చల్లినట్లయ్యింది. ఓట్ల తొలగింపు వివాదాలు లేకుండా వుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో (సీమాంధ్ర) రికార్డు స్థాయి ఓటింగ్‌ నమోదయ్యేదే. అన్నట్టు సాయంత్రం పోలింగ్‌ పూర్తయ్యే సమయానికి అధికారిక ప్రకటనను బట్టి పోలింగ్‌ శాతంపై విశ్లేషణలు షురూ అవుతాయి.

Leave a Comment