సీమాంధ్ర పోలీస్‌కు బెజవాడే బాస్

2*డీఐజీ స్థాయి నుంచి నేరుగా అడిషనల్ డీజీ స్థాయికి
* అడిషనల్ డీజీగా సురేంద్రబాబు?
* కీలకం కానున్న జంటనగరాల పోలీసింగ్
*కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ పోలీసులు నంబర్‌వన్ కానున్నారు. ఇప్పటివరకు డీఐజీ స్థాయి క్యాడర్‌కే పరిమితమైన విజయవాడ కమిషనరేట్‌ను ఏకంగా అదనపు డీజీ స్థాయికి పెంచనున్నారు. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర హోం శాఖకు చేరినట్లు సమాచారం. దీంతోపాటు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గుంటూరు అర్బన్ పోలీసు జిల్లాను డీఐజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేసి కమిషనరేట్‌గా మార్చనున్నారు. 60 కిలోమీటర్ల దూరంలో ఏలూరును పశ్చిమగోదావరి జిల్లా నుంచి విభజించి ఏలూరు అర్బన్ జిల్లాగా మార్చే ప్రతిపాదనలు పంపారు. వీటికి ఆమోదముద్ర పడితే సీమాంధ్ర పోలీసింగ్‌కు బెజవాడ కీలకం అవుతుంది.
 
సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ నగర కమిషనరేట్‌కు హైదరాబాద్ మెట్రో నగరం స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేపట్టేందుకు  కేంద్ర హోంశాఖ కసరత్తుప్రారంభించింది. రాష్ట్ర అవతరణ తేదీ అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీఎం తాత్కాలిక క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ కమిషనరేట్‌ను  నేరుగా అడిషనల్ డీజీ స్థాయికి చేయనున్నారు. ఇక్కడ కమిషనర్‌గా రెండో పోలీస్ బాస్ స్థాయిలో ఉన్న అడిషనల్ డీజీని నియమించనున్నారు.

ఈ పోస్టింగ్ కోసం అప్పుడే పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో సీపీగా సమర్ధంగా పనిచేసిన నిమ్మగడ్డ సురేంద్రబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనతోపాటు గతంలో ఇక్కడ పనిచేసి ప్రస్తుతం  కీలక  కేడర్‌లో ఉన్న  ఉమేష్ షరాఫ్, ఎ.బి.వెంకటేశ్వరరావుల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం.

రెండేళ్లలో రెట్టింపు కానున్న స్టేషన్లు, సిబ్బంది..

 
కొత్త రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో విజయవాడ అత్యంత కీలకం కానుంది. ఇక్కడ ఎయిర్‌పోర్టు, హైటెక్ సిటీ, ఇంద్రకీలాద్రి, విజయవాడ రైల్వే జంక్షన్ ఉన్నాయి. వీటికి ఇప్పటికే భద్రత పెంచాల్సిన అవరం ఉందనే ప్రతిపాదనలు కేంద్ర హోంశాఖ వద్ద ఉన్నాయి.  వీటితో రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా ఏర్పాటయ్యే పలు రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సిబ్బంది, అధికారులు, ఉన్నతాధికారుల సంఖ్య గణనీయంగా పెరగనుంది.

వారందరి భద్రతకు రెట్టింపు  పోలీసు సిబ్బంది అవసరం ఉంటుంది. కమిషనరేట్‌లో ఇప్పుడున్న రెండున్నర వేలమంది పోలీసులకు అదనంగా మరో రెండున్నర వేలమందిని పెంచనున్నారు. కమిషనరేట్‌లో 11 పోలీస్ స్టేషన్లు, రూరల్‌లో 9 స్టేషన్లు మొత్తం 20 ఉన్నాయి. ఇవిగాక కమిషనరేట్‌లో మరికొన్ని ప్రాంతాలను కూడా కలిపే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. ఇదంతా రానున్న రెండేళ్లలో జరగవచ్చని భావిస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పాటు  పూర్తయితే విజయవాడ కమిషనరేట్ హైదరాబాద్ నగరం స్థాయిలో భద్రత ఉంటుందని చెబుతున్నారు.  విభజనతో పోలీసుల శాఖలో అన్ని కేడర్‌లలో ప్రమోషన్లు ముందుగానే వచ్చే అవకాశాలున్నాయి. మిగిలిన కేడర్‌ల క ంటే  సీఐలకు డీఎస్పీ  ప్రమోషన్లు  ముందుగా వచ్చే అవకాశాలున్నాయి.  కొత్త సిబ్బంది నియామకం కూడా జరుగనున్నట్లు సమాచారం.
 
విజయవాడ అర్బన్ జిల్లా

విజయవాడ 1983 మే 18న అర్బన్ జిల్లాగా ఆవిర్భవించింది. అప్పట్లో ఐదు లక్షల జనాభా ఉండడంతో ఎనిమిది లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్లు, ఒక మహిళా పీఎస్, 10 రూరల్ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లు, నాలుగు ట్రాఫిక్ పీఎస్‌లతో అర్బన్ జిల్లా కార్యకలాపాలను సాగించింది. తొలి ఐపీఎస్ అధికారిగా కె.ఎస్.వ్యాస్ పనిచేశారు. ఇప్పటికే కమిషనరేట్‌ను అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. తాజా పరిణామాలతో విజయవాడ, గుంటూరు పట్టణాలు జంటనగరాలుగా అభివృద్ధి చెందనున్న దృష్ట్యా నేరుగా అడిషనల్ డీజీ కేడర్‌కు అప్‌గ్రేడ్ చేయనున్నారు.
 
గుంటూరు అర్బన్ జిల్లా

గుంటూరు అర్బన్ జిల్లా 2010 సంవత్సరం జూన్‌లో ఏర్పాటైంది. అనంతరం నగర పరిసర ప్రాంతాలు విస్తరించడంతో జనాభా భారీగా పెరిగింది. వాస్తవానికి 2016లో అప్‌గ్రేడ్ కావాల్సిన గుంటూరు అర్బన్ జిల్లా రాష్ట్ర విభజన నేపథ్యంలో ముందే అప్‌గ్రేడ్ కానుంది. డీఐజీ స్థాయి అధికారి కమిషనర్‌గా, ఐపీఎస్ అధికారులు ఇద్దరిని ఇక్కడ డీసీపీలుగా నియమించే అవకాశం ఉంది.

Leave a Comment