సూర్యుడి పల్స్ పట్టేసింది!

13సౌర విమానం ‘సోలార్ ఇంపల్స్-2’ సక్సెస్

 జెనీవా: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సౌర విద్యుత్‌తో సుదీర్ఘ ప్రయాణం చేయగలిగిన సామర్థ్యమున్న విమానం ‘సోలార్ ఇంపల్స్-2’ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. 2015 మార్చిలో ప్రపంచాన్ని చుట్టిరానున్న ఈ విమానం భారత్‌లోనూ అడుగుపెట్టనుంది. దాదాపు పూర్తిగా సౌరవిద్యుత్‌తో నడిచే ఈ విమానాన్ని సోమవారం స్విట్జర్లాండ్‌లో ఆవిష్కరించి, ప్రయోగాత్మకంగా నడిపిచూశారు. రాత్రీ, పగలూ కూడా నడవగలిగిన ఈ విమానాన్ని జర్మనీకి చెందిన పైలట్ మార్కస్ షెర్డెల్ సోమవారం దాదాపు రెండు గంటలా 17 నిమిషాలపాటు నడిపారు. కేవలం ఒక్కరు మాత్రమే కూర్చోగలిగిన ఈ విమానం రెక్కలు మాత్రం బోయింగ్-747 కంటే పెద్దగా 72 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. బరువు మాత్రం అతి తక్కువగా కేవలం 2,300 కిలోలు.. అంటే ఒక పెద్ద కారు బరువు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ విమానం 2015 మార్చిలో ప్రపంచాన్ని చుట్టిరానుంది.

అందులో భాగంగా భారత్‌లోనూ అడుగుపెట్టనుంది. అయితే, విమానం సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించడం కోసం ఆలోగా మరికొన్ని సార్లు ప్రయోగాత్మకంగా నడిపిచూస్తారు. ఆ తర్వాత విమానం రూపకర్తలు, సోలార్ ఇంపల్స్ సంస్థ వ్యవస్థాపకులు ఆండ్రె బోర్చ్‌బెర్గ్,  బెర్ట్రాండ్ పిక్కార్డ్ దీనితో ప్రపంచాన్ని చుట్టిరానున్నారు. దాదాపు వరుసగా 120 గంటలపాటు పగలు, రాత్రీ తేడాలేకుండా ప్రయాణించగలిగే సామర్థ్యాన్ని సాధించడమే ‘సోలార్ ఇంపల్స్-2’ లక్ష్యమని రూపకర్తలు చెబుతున్నారు.
 

Leave a Comment