సోనియా చేతిలో… పెద్దల జాబితా

  • soరేపు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు వెల్లడి!
  • సోమవారం నామినేషన్లకు చివరి రోజు
  • కేపీసీపీ చీఫ్‌ను రాజ్యసభకు పంపేలా సీఎం వ్యూహం
  • సమ్మతించని దిగ్విజయ్ సింగ్
  • శాసన మండలి వైపే పరమేశ్వర మొగ్గు

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. బహుశా శనివారం అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది. శాసన సభ నుంచి శాసన మండలికి ఏడు స్థానాలు, రాజ్యసభకు నాలుగు స్థానాలకు ఈ నెల 19న  ఎన్నికలు జరగాల్సి ఉంది. నామినేషన్ల దాఖలు ఘట్టం సోమవారం ముగియనుంది.

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు సోనియా గాంధీతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో గురువారం చర్చించారు. అభ్యర్థుల జాబితాను సోనియాకు అందజేశామని, ఎంపికపై ఆమె తుది నిర్ణయం తీసుకుంటారని సీఎం ఢిల్లీలో తెలిపారు. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ జాబితా వెలువడుతుందని పరమేశ్వర చెప్పారు.

రాజ్యసభకు పరమేశ్వర?

ముఖ్యమంత్రితో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పైకి ఎన్ని మాటలు చెబుతున్నా, వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలున్నాయనేది బహిరంగ రహస్యం. పరమేశ్వరను శాసన మండలికి పంపడం ద్వారా ఉప ముఖ్యమంత్రిని చేయాలని పార్టీలోని ఓ వర్గం బలంగా డిమాండ్ చేస్తోంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే, రాష్ట్రంలో మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని సీఎం ఆందోళన చెందుతున్నారు. కనుక పరమేశ్వరను రాజ్యసభకు పంపాలని ఆయన ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ వద్ద ప్రస్తావించినప్పుడు, ఆయన సమ్మతించలేదని సమాచారం.

పరమేశ్వర కూడా శాసన మండలికే వెళ్లాలనుకుంటున్నారు. మొత్తం ఏడు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కాంగ్రెస్ నాలుగు స్థానాలను సునాయాసంగా గెలుచుకోవచ్చు. బీజేపీ, జేడీఎస్‌లకు చెరో స్థానం దక్కే అవకాశాలున్నాయి. ఈ పార్టీల సహకారంతో మరో అభ్యర్థి కూడా ఎగువ సభకు ఎన్నిక కావచ్చు.

వేరే రాష్ట్రాల వారికి స్థానం లేదు

రాజ్యసభలో నాలుగు స్థానాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ సులభంగా రెండు స్థానాలను గెలుచుకోనుంది. బీజేపీ ఓ స్థానాన్ని చేజిక్కించుకోనుంది. కాంగ్రెస్, జేడీఎస్‌ల మద్దతుతో మరో అభ్యర్థి రాజ్యసభలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తమ అభ్యర్థి పోటీలో ఉంటారని జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ప్రకటించారు. కాగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తమ పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టబోమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో తెలిపారు. మ రో వైపు బీజేపీ కూడా కర్ణాటక వాసినే ఎగువ సభకు పంపాలని యోచిస్తోంది.

తొలుత కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపిక చేయాలనుకుంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆమె పార్టీ కర్ణాటక వ్య వహారాలను కూడా పర్యవేక్షించే వారు. ఇప్పటికే ఇతర రా ష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పా టు ఆర్. రామకృష్ణలను ఎన్నుకున్నందున, ఈసారి స్థానికులను ఎంపిక చేయాలని పార్టీపై ఒత్తిడి పెరిగింది. కనుక ప్రస్తుతం రిటైర్ కానున్న ప్రభాకర్ కోరెను తిరిగి ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

కాగా కాంగ్రెస్ కూడా ప్రస్తుతం రిటైర్ కానున్న ఎస్‌ఎం. కృష్ణ, బీకే. హరిప్రసాద్‌లను తిరిగి రాజ్యసభకు పంపాలనుకుంటోంది. ఇద్దరికి అభ్యర్థిత్వాలు ఖరారైనట్లేనని చెబుతున్నప్పటికీ, కృష్ణ విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకు ఆప్తుడైన కేంద్ర మాజీ మంత్రి సీఎం. ఇబ్రహీంను ఎంపిక చేయించాలని ప్రయత్నిస్తున్నారు.

Leave a Comment