సోనియా వల్లే తెలంగాణ సాకారం: కేసీఆర్

kcrహైదరాబాద్ : యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణ సాధ్యమైందని టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగంపై చర్చలో భాగంగా కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించారు. తెలంగాణకు సహకరించిన సోనియాగాంధీకి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ బిల్లుకు సహకరించిన అన్ని పార్టీలకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 33 పార్టీలు సహకరించాయని, బీజేపీ నేత రాజ్నాథ్ సింగ్ కూడా చొరవ చూపారని కేసీఆర్ అన్నారు.  తెలంగాణ ఏర్పాటు సమిష్టి కృషిగా ఆయన అభివర్ణించారు. ఈ విజయం యావత్ తెలంగాణ ప్రజలదని కేసీఆర్ అన్నారు. తాము ఒంటెద్దు పోకడలు పోవటం లేదని, రాజకీయ విభేదాలు పక్కనపెట్టి అందరికి కలుపుకుని ముందుకు వెళతామని, బంగారు తెలంగాణ తప్పక సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

గవర్నర్ ప్రసంగంలో అన్ని విషయాలను ప్రస్తావనకు పెట్టడం సాధ్యం కాదని కేసీఆర్ అన్నారు. నిర్మాణాత్మక సూచనలను సుహృదయంతో స్వీకరిస్తామని, జానారెడ్డి సూచనలను స్వాగతిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణకు రావల్సిన నీటి వాటాలు సాధిస్తామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షాలను కలుపుకు వెళతామన్నారు. అన్ని పార్టీలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మేరకే రిజర్వేషన్లు ప్రకటించామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడుగు, బలహీన వర్గాల రాష్ట్రంగా ఆయన అభివర్ణించారు.

Leave a Comment