స్కామ్ ఇండియాను స్కిల్ ఇండియాగా మారుద్దాం

Modiదేశాభివృద్ధికి కలసి రండి… ప్రతిపక్షాలకు ప్రధాని మోడీ ఆహ్వానం
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు
ఉభయసభల్లో సమాధానమిచ్చిన ప్రధానమంత్రి
విమర్శలకు భయపడను.. సద్విమర్శలను స్వాగతిస్తా
ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…
అన్ని వర్గాల ప్రగతితోనే సమాజాభివృద్ధి రాష్ట్రాలపై పెద్దన్న పెత్తనం ఉండదు
పేదరికంపైనే మా తొలిపోరు; 2022 నాటికి అన్ని వసతులతో అందరికీ ఇళ్లు

 
గతకాలపు చేదును మరచిపోదాం. దేశాభివృద్ధి కోసం మనం కలసి పనిచేయాల్సి ఉంది. మీరు లేకుండా ముందుకెళ్లాలని నేను అనుకోవడం లేదు. సభ్యుల సంఖ్య ఆధారంగా కాకుండా.. కలసికట్టుగా నిర్ణయాలు తీసుకుందాం. అవసరమైతే మీ నిర్దేశకత్వంలోనే ముందుకెళ్దాం.
 
న్యూఢిల్లీ: ముస్లింలు సహా దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడతానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. గతం మరచిపోయి.. దేశాభివృద్ధిలో కలసిరావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం రాష్ట్రాలపై పెద్దన్న తరహాలో పెత్తనం చెలాయించదని, సహకార సమాఖ్య విధానాన్ని అవలంబిస్తామని రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. తన ప్రభుత్వం దేశంలోని పేదలకు చెందినదని, ప్రజల ఆకాంక్షలకు సంరక్షకుడిగా ఉంటుందని ఉద్ఘాటించారు. నేర చరితుల నుంచి రాజకీయాలను కాపాడాల్సి ఉందని, అందుకోసం ఎంపీలపై ఉన్న కేసుల విచారణను సంవత్సరంలోగా పూర్తి చేయాలంటూ న్యాయవ్యవస్థను కోరుతామని ప్రకటించారు.
 
  అనంతరం రాష్ట్రాల చట్టసభలు, స్థానిక సంస్థల సభ్యులకూ దాన్ని వర్తింపజేస్తామన్నారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం బుధవారం తొలుత లోక్‌సభలో, అనంతరం రాజ్యసభలో ప్రధాని ప్రసంగించారు. పార్లమెంటు ఉభయసభల్లో ఇదే మోడీ తొలి ప్రసంగం కావడం విశేషం. భారత్‌ను అభివృద్ధిపథంలో నడిపి దేశంపై పడిన ‘స్కామ్ ఇండియా’ అనే ముద్రను చెరిపేసి నైపుణ్య భరిత ఇండియా’గా మార్చాలన్న తన స్వప్నాన్ని ఈ సందర్భంగా సభ్యులకు ప్రధాని వివరించారు. స్వప్నాల సాకారానికి కలసికట్టుగా కృషి చేద్దామంటూ ప్రతిపక్షాన్ని ఆహ్వానించారు. మోడీ ప్రసంగం అనంతరం ఉభయ సభల్లో ఆ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అనంతరం ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి.
 
 సంక్షేమానికే సద్విమర్శలు
 స్పష్టమైన సాధికారతతో, అప్పుడప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విసుర్లతో.. పలుమార్లు మహాత్మాగాంధీని గుర్తుచేస్తూ.. దాదాపు గంట పాటు సాగిన మోడీ ప్రసంగాన్ని సభ్యులంతా ఆసక్తిగా, శ్రద్ధగా ఆలకించారు. ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలంటూ ఈ సందర్భంగా మోడీ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. విజయం చాలా పాఠాలు నేర్పిస్తుందంటూ.. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలను స్వాగతిస్తానని, వాటి వల్లనే తమకు అహంకారం తలకెక్కకుండా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి.
 
 విమర్శలకు నేను భయపడను. నిరుత్సాహపడను. ప్రజాస్వామ్యంలో విమర్శల వల్ల సామర్థ్యం పెరుగుతుంది. అవి మనకు మార్గం చూపిస్తాయి. సద్విమర్శలు దేశ సంక్షేమానికే ఉపయోగపడతాయి’ అన్నారు. ‘గతకాలపు చేదును మరచిపోదాం. దేశాభివృద్ధి కోసం మనం కలసి పనిచేయాల్సి ఉంది. మనం ఏకమై దేశానికి అవసరమైన మార్పును తీసుకురాగలం. మీరు లేకుండా ముందుకెళ్లాలని నేను అనుకోవడం లేదు. సభ్యుల సంఖ్య ఆధారంగా కాకుండా.. కలసికట్టుగా నిర్ణయాలు తీసుకుందాం. అవసరమైతే మీ నిర్దేశకత్వంలోనే ముందుకెళ్దాం’ అంటూ ప్రతిపక్షాలకు స్నేహ హస్తం అందించారు.
 
 తప్పుగా మాట్లాడితే క్షమించండి
 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం బీజేపీ నేతల్లో అహంకారం పెరిగిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను మోడీ తిప్పికొట్టారు. లోక్‌సభలోకి మొదటిసారి అడుగుపెట్టానని, ప్రతిపక్ష నేతలు సహా సీనియర్లందరి సహాయ సహకారాలు తనకు అవసరమని వినమ్రంగా ప్రకటించారు. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలంటూ సీనియర్లను కోరారు. మైనారిటీల అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ‘శరీరంలోని ఒక భాగం బలహీనంగా ఉన్నప్పుడు శరీరమంతా దృఢంగా ఉందని అనగలమా?’ అంటూ ముస్లింల అభివృద్ధికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
 
 ఇది వారిని తృప్తిపరిచేందుకో లేక బుజ్జగించేందుకో కాదని స్పష్టం చేశారు. తన చిన్నప్పుడు తనకు తెలిసిన ఒక ముస్లిం కుటుంబం మూడు తరాలుగా ఎలాంటి అభివృద్ధి లేకుండా సైకిల్ రిపేరింగ్ షాపునే నడిపిస్తూ వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే సమాజం ప్రగతి సాధిస్తుందన్నారు. ఫేస్‌బుక్‌లో చేసిన ఒక పోస్టింగ్ వల్ల పుణేలో ఒక ముస్లిం యువకుడు హత్యకు గురికావడంపై మోడీ మొదటిసారి స్పందించారు. ఆ హత్యతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని బాదౌన్‌లో జరిగిన అత్యాచారాలను ప్రస్తావిస్తూ.. ‘అవి చాలా బాధాకరమైనవి. మన అంతరాత్మ మనల్ని క్షమించదు’ అని వ్యాఖ్యానించారు.
 
 దుర్యోధనుడి లాగే కాంగ్రెస్..
ఒకవైపు ప్రతిపక్షానికి శాంతి సందేశం పంపిస్తూనే.. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. పాండవుల్లా మళ్లీ అధికారంలోకి వస్తామన్న లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘నిన్న ఇక్కడ మహాభారతం ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా నాకు కురు సార్వభౌముడు దుర్యోధనుడన్న మాటలు గుర్తొస్తున్నాయి. తనకు ధర్మం, వాస్తవం తెలిసినప్పటికీ వాటిని అనుసరించడం తనకు ఇష్టం లేకపోయిందని దుర్యోధనుడే ఆనాడన్నాడు. అలాగే, కాంగ్రెస్‌కు కూడా ఏది సరైందో, ఏది తప్పో తెలుసు. అయినా సరైన మార్గం అనుసరించలేకపోయారు’ అంటూ స్వపక్ష సభ్యుల హర్షాతిరేకాల మధ్య కాంగ్రెస్‌పై వాగ్బాణాలు విసిరారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ‘ఏక్ భారత్ – శ్రేష్ట్ భారత్’ నినాదంపై కాంగ్రెస్ విమర్శలను ప్రస్తావిస్తూ.. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీక అని అభివర్ణించారు. పార్టీలన్నీ విభజన భాషను వదలి ఏకత్వ భాషను ఉపయోగించాలని సూచించారు. కుల, ప్రాంతీయవాదాలు దేశాన్ని నాశనం చేశాయన్నారు.
 
మద్యం గుర్తుకురావడం సహజమే!
 మోడీ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ‘పాత సీసాలో కొత్త సారానే’ అన్న కాంగ్రెస్ నేత అమరిందర్ సింగ్ వ్యాఖ్యల్ని మోడీ అన్యాపదేశంగా ప్రస్తావించారు. ‘ఆయనకు మద్యం గుర్తురావడం సహజమే’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
 
 మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
 *   పార్లమెంటు సభ్యులకు నేర చరిత ఉందంటూ ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. దాన్ని తొలగించాలి. ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. సంవత్సరంలోగా ఎంపీలపై ఉన్న కేసుల విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టును కోరుదాం. చట్టం అంటే భయం ఏర్పడాలి. దోషులు జైలుకు వెళ్లాలి. నిర్దోషులు ప్రజల్లో ఉండాలి. 2015 తరువాత లోక్‌సభ, రాజ్యసభలో మచ్చలేని వ్యక్తులు ఉండాలి.
*    రాష్ట్రపతి ప్రసంగం అంటే మనకు అత్యంత పవిత్రమైనది. మన ప్రజాస్వామ్య సంప్రదాయంలో ఒక భాగం. తన ప్రసంగంలో రాష్ట్రపతి పేర్కొన్న అన్ని హామీలు మనకు ఆదేశాల వంటివి. వాటిని నెరవేర్చి తీరుతాం.
*    పేదల అభివృద్ధే తొలి ప్రాథమ్యం. పేదరికంపై పోరు, విద్యకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల సాధికారత.. ఇవే లక్ష్యంగా పనిచేస్తాం. రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్న ‘రూర్బన్’ ప్రాతిపదికగా పట్టణాల్లో ఉండే సౌకర్యాలన్నీ గ్రామాల్లోనూ కల్పిస్తాం.
*  అత్యాచారంపై మానసిక విశ్లేషణలు ఆపేయాల్సిందిగా రాజకీయ నేతలను కోరుతున్నా. అన్ని సందర్భాల్లోనూ ఏదో ఒక ప్రకటన ఇవ్వడం సరైనదేనా? మౌనంగా ఎందుకు ఉండలేం?
* వ్యవసాయ, మౌలిక వసతుల రంగంలో మెరుగైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రాల మోడల్‌ను అనువైన మిగతా ప్రాంతాల్లోనూ అమలుచేస్తాం. అభివృద్ధి విషయంలో రాష్ట్రాలు పోటీపడటం నాకు సంతోషాన్నిస్తుంది.
*  ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తామంటూ హామీ ఇచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. ప్రతీ పేదవాడికి అన్నం దొరకాలి. ఇది మనందరి లక్ష్యం కావాలి.
‘పరిశుభ్ర భారత్’ను నిర్మిస్తామంటూ ప్రతిజ్ఞ చేసి, అమలు చేసి మన జాతిపితకు.. 2019లో జరిగే ఆయన 150వ జయంతోత్సవాల నాటికి బహుమతిగా ఇద్దాం.
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తాం. వ్యవసాయంలో నూతన ప్రక్రియల్ని ప్రోత్సహిస్తాం. దేశ జనాభా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా భూ ఉత్పాదకతను పెంచాల్సి ఉంది.
* పశ్చిమబెంగాల్‌లో గత 35 ఏళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి నా సోదరి మమత కష్టపడుతున్నారు.
* కేంద్రం నిర్ణయాలు తీసుకునే ముందు రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. కేంద్రం అభిప్రాయాల్ని రాష్ట్రాలపై రుద్దబోం.
 విదేశాల్లో నల్లధనం ఎవరి పేరున, ఎంత, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి. ఆ దిశగా చర్యలు చేపట్టాం. అవినీతి కట్టడిలో టెక్నాలజీ పాత్ర కీలకం.

Leave a Comment