స్నేహహస్తాలు ఫౌండేషన్ – Transforming Rural India Through Education
Sneha Hastalu (3)మనకి నడక నడత నేర్పిన సమాజాన్ని పరిపుష్టం చేసుకుంటూ భావితరాలకి మరింత అందమైన సమాజాన్ని అందించటం మన కర్తవ్యం అనే ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ “స్నేహహస్తాలు” … ముందు పుట్టిన మనం అన్నీ వనరులనే ముందే అనుభవించకుండా మన తర్వాతి తరం వారికి కూడా వాటిని అందించాలన్న సంకల్పంతో 4 మిత్రులు కలిసి వేసిన ముందడుగు “స్నేహహస్తాలు” రూపంలో కొన్ని వందల మంది మిత్రులని గ్రామీణ భారతంలో విద్యా వనరులని పెంచే దిశగా పయనింప చేస్తుంది…
 
పత్రికలలో వచ్చే “లక్ష్మీ కటాక్షం లేని సరస్వతీ పుత్రుల” కథనాలకి స్పందించి సాయం చెయ్యటంతో పురుడు పోసుకున్న ఈ  “స్నేహ హస్తాలు” , నేడు ఒక సంస్థగా రూపాంతరం చేసింది అక్షర సేద్యంతో కొన్ని వందల మంది విద్యార్ధులకి విజ్ఞాన సిరులు అందిస్తుంది… ఈ సుదీర్ఘ పయనంలో ప్రకృతి విపత్తులలో అందించిన ఆపన్న హస్తం అయినా, పేద  విద్యార్ధుల ఉన్నత చదువుల కలని నెరవేర్చే ప్రయత్నాలు అయినా, ప్రభుత్వ పారశాలల దత్తత అయినా, పర్యావరణ పరిరక్షణకై మొక్కల పెంపకంలో అయినా తోడునీడగా నిలిచింది స్నేహితులే.. స్నేహహస్తాలు వేసిన,వేస్తున్న ప్రతి అడుగులోనూ మంచి మనసున్న ఎందఱో స్నేహితుల ప్రేరణ- ప్రోత్సాహం, ఆదరణ-ఆలోచనలు వెల కట్టలేనివి. 
 
Sneha Hastalu (4)
 
మొదట్లో వార్త పత్రికలలో లేదా సన్నిహితులద్వారా వచ్చే విజ్ఞప్తులని పరిశీలించి, ఆ విద్యార్ధులతో మాట్లాడి వారి ఆలోచనలు,ఆశయాలు అర్ధం చేసుకుని వారికి సాయం అందించటం జరుగుతుండేది. వాళ్ళు చదువుకునే కళాశాల యాజమాన్యం,. అధ్యాపకులతో సంప్రదించి వారి ఆర్ధిక పరిస్థితిని అవగాహన చేసుకుని, ఎంత సాయం అవసరమో అంచనా వేసుకుని “Friends For Helping Hands” పేరుతో స్నేహితుల దగ్గర నుండి సేకరించి కాలేజి పేరు మీద  D.D/Checkతో ఆర్ధిక సాయం చేస్తుండే వాళ్ళం.. 
 
2009లో కృష్ణా వరద సృష్టించిన ప్రళయం ఇప్పటికీ మమ్మల్ని కదిలిస్తూనే వుంటుంది.. సర్వం కోల్పోయి మంచి నీటికి,ఆకలికి అలమటించే ఎన్నో పసిహృదయాల ఆక్రందన ఎందరినో కలచివేసింది.. చూస్తూ బాధపడటం కాదు, బాద్యత గుర్తుకు తెచ్చుకుని యువకులుగా మన వంతు సాయం మనం చెయ్యాలనే మా ఆలోచనకి దేశ విదేశాలలో వున్న ఎందఱో స్నేహితులు మద్దతుగా నిలిచారు.. బెంగుళూరు నుండి ఆహరం, పాలు, నీళ్ళు, దుప్పట్లతో మన “స్నేహహస్తాలు” బృందం కర్నూలు,రేపల్లె ప్రాంతాలకి వెళ్లి  ఆపన్నులకి చేతనైన సాయం అందించటం జరిగింది.. మానవత దృక్పదంతో ఆలోచించి తోడు నిలిచిన స్నేహితుల నమ్మకం మమ్మల్ని కదిలించింది..మరెంతో బాధ్యతని గుర్తు చేసింది. సాయం చెయ్యాలన్న ఆలోచన,ఆశయం ఎందరికో వున్నా, వారికి నేరుగా చేసే తీరిక,ఓపిక లేకపోవటం..పరోక్షంగా చేసే దానికి సరైన వేదిక లేకపోవటం మా కర్తవ్యాన్ని మాకు గుర్తు చేసి మరింత ప్రణాళికతో పనిచేసేలా ప్రేరేపించింది….ఆ ఆలోచనల నుంచే గ్రామీణ భారతానికి మన శక్తీ,యుక్తులతో ఏదన్నా చెయ్యాలనే ధృడ సంకల్పం ఏర్పడింది…ఆ ఫలితమే “స్నేహ హస్తాలు ఫౌండేషన్” 
 
 
Sneha Hastalu (2)ఆధునిక భారతాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య పేదరికం.. భారత దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల నుంచే ఆ పేదరిక నిర్మూలన జరగాలనేది మా ఆలోచన….ఆ పేదరికానికి విరుగుడు విద్య,విజ్ఞానమే అనేది నిజం . గ్రామీణ ప్రాంతాల నుంచి ఎదిగొచ్చిన మనం నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం.. ఆ ఫలాలని కేవలం మనం మరియు మన కుటుంభ సభ్యులు అనుభవించటమే కాదు మనకి నడక,నడత నేర్పిన సమాజానికి అందించటం కూడా మన భాద్యత … ఆ బాధ్యత అందరికీ విద్యా అవకాశాలు కల్పించటమే అయితే, నాగరిక సమాజ నిర్మాణం చాలా వేగవంతం అవుతుంది అని బలంగా నమ్మాము….దానికి గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాటశాలల బలోపేతమే సరైన మార్గంగా ఎంచుకున్నాం… నేడు భారత దేశ ముఖచిత్రాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్ధిక,సామాజిక,సాంస్కృతిక,రాజకీయ,శాస్త్ర సాంకేతిక రంగాలలోని  కీలక స్థానాల్లో వున్న వ్యక్తులు అందరూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాటశాలల నుంచి చదువుకున్న వారే.. ఈ దేశ నిర్మాణంలో ప్రభుత్వ పాటశాలలది వెల కట్టలేని విలువైన పాత్ర.. ఆ ప్రభుత్వ బడుల మీద నేడు సమాజంలో వున్న చిన్న చూపు పోయి కార్పొరేటు విద్యకి దీటుగా ప్రభుత్వ విద్యని నిలిపి, అందరికీ విద్యని అతి తక్కువ ధరలో అందించేలా చెయ్యటమే మన “స్నేహ హస్తాలు” ప్రాధమిక లక్ష్యం. 
 
 2009లో ఒక ప్రభుత్వ పాటశాల దత్తతో ప్రారంభమైన ఈ “School Adoption” కార్యక్రమం నేడు 60 ప్రభుత్వ ప్రాధమిక పాటశాలలని దత్తత తీసుకుని 5600 మంది విద్యార్ధులకి విజ్ఞాన సిరులు అందించే స్థాయికి చేరుకుంది. గుంటూరు జిల్లాఅచ్చంపేట,తుళ్ళూరు మండలాలలోని 60 ప్రభుత్వ పాటశాలల్ని మన స్నేహహస్తాలు దత్తత తీసుకుంది . బాల్యం ప్రతి మనిషికి చాలా కీలక దశ.. ఆ పసి మనస్సులకి ఆహ్లాదమైన బాల్యాన్ని అందించగలిగితే బలమైన దేశ నిర్మాణం జరుగుతుంది.. ఆ Little Hearts ప్రతిరోజూ బడికి వచ్చేలా,క్రమశిక్షణతో  చదివేలా చేస్తూ వాళ్ళకి నాణ్యమైన విద్యా అవకాశాలు కల్పన కోసంస్నేహహస్తాలు చేస్తున్న ప్రయత్నాలకి,  ప్రభుత్వ ఉపాద్యాయుల చిత్తశుద్ది , అధికారుల ప్రోత్సాహం, గ్రామస్తుల చేయూత తోడై ఒక “మోడల్ విద్యా విధానం“(Model Education System) తయారు చేయగలుగుతున్నాం… ప్రతి విద్యార్ధికి పరిశుభ్రత పట్ల అవహగన కల్పించి బడికి రావాలనే ఆరాటం పెరిగేలా చెయ్యటం కోసం యూనిఫాం,టై,బెల్టు,బ్యాడ్జి,షూస్,స్కూల్ బ్యాగుఇవ్వటమే కాకుండా చదువుకునే విధానంలోనే సమూల మార్పులు ఉండాలనే ఆలోచనతో మాంటిస్సొరి మెటీరియల్, కాంపోజిషన్ పుష్తకాలు,నోటుబుక్స్, డ్రాయింగ్ పుస్తకాలు కూడా అందిస్తూ చేస్తున్న ప్రయత్నం సానుకూల ఫలితాలని అందిస్తుంది. విద్యార్ధి చదువు పట్ల తల్లిదండ్రుల ఆలోచనలలో మార్పు తీసుకు వచ్చి వారిని ఉపాధ్యాయుడితో అనుసంధానం చెయ్యటం కోసం ఇస్తున్న “స్కూల్ డైరీ“కి చక్కటి స్పందన వస్తుంది. విద్యార్ధి ఇంటి దగ్గర చెయ్యాల్సిన పనుల్ని ఉపాధ్యాయుడు డైరీలో రాసి పంపితే,  తల్లిదండ్రులు ప్రతిరోజూ వాటిలో సంతకం చేసి తమ పిల్లవాడి పురోగతిని స్వయంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రతిభ చూపే విద్యార్ధులని ప్రోత్సహించటం కోసం ఇస్తున్న చిన్న చిన్న బహుమతులు ఆ పసి హృదయాలకి మరింత ప్రేరణ నింపుతున్నాయి. 
 
దత్తత తీసుకున్న పాటశాలలో ఉపాద్యాయుల కొరతని దృష్టిలో పెట్టుకుని 3 కాంట్రాక్టు ఉపాధ్యాయుల్ని, 3 విద్యా వాలంటీర్లనినియమించి జీతాలు అందిస్తున్నాం. ఈ చిన్న ప్రయత్నం చాలా పెద్ద మార్పుకి బీజం వేసింది. ఉపాధ్యాయులు అంకితభావంతో ఉన్నత లక్ష్యాల కోసం పని చేసేలా ప్రేరేపిస్తుంది. “స్నేహహస్తాలు” దత్తత తీసుకున్న అన్ని ప్రభుత్వ పాటశాలల ప్రాధాన ఉపాధ్యాయులతో ప్రతి 3 నెలలకి ఒకసారి రివ్యూ మీటింగ్ ద్వారా పనితీరుని అంచనా వేసుకోవటం, విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రతి విద్యార్ధి నైపుణ్యాన్ని అంచనా వెయ్యటం కోసం “Base Assessment test” & ప్రతి 3 నెలలకి ఒక “Assessment Test” ద్వారా విద్యార్ధి పురోభివృద్దిని పరీక్షించే ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్ధులలో పర్యావరణం పట్ల,ప్రకృతి పట్ల అవగాహన పెరిగి సామాజిక బాధ్యత ఆ పసిహృదయాల్లో బలంగా నాతుకునేలా చెయ్యటం కోసం మొదలు పెట్టిన ” Tree Plantation” చేపట్టి , ఇప్పటి వరకు సుమారుగా 2500 మొక్కలు నాటి 2000 “Tree Guards” ఏర్పాటు చేసి ఒక్కో మొక్క బాద్యత  ఒక్కో విద్యార్ధికి అప్పగించి చేస్తున్న ప్రయోగం అద్భుత ఫలితాలని సాదిస్తుంది. 
Sneha Hastalu (1)
 
గ్రామీణ ప్రాంతాలలో చదువులో  చక్కని ప్రతిభ చూపిస్తూ ఆర్ధికంగా చదువుకునే స్తోమత లేని విద్యార్ధుల ఉన్నత చదువులకి అండగా నిలవటం ద్వారా ” స్నేహహాస్తాలు” Youth Empowerment దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు 12 మంది విద్యార్ధులకి B.Tech/MBA/MCA/Medicine/CA/B.Sc చదువుల కోసం సహాయం చేస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా భాగంగా భావస్వారూప్యం వున్న TPF(Telugu People Foundation) లాంటి సంస్థలతో కలిసి “స్నేహహస్తాలు” చేస్తున్న ప్రయత్నాలకి మంచి స్పందన వస్తుంది. ఇప్పటి వరకు 3 విద్యార్ధులు MCA పూర్తిచేసి TCS/IMI Mobile లాంటి సంస్థల్లో ఉద్యోగులుగా చేరటం “స్నేహహస్తాలు ఫౌండేషన్” కార్యదక్షతకి ఒక నిదర్శనం. 
 
దేశ ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గార్ల  “డిజిటల్ ఇండియా” ఆలోచనలకి అనుగుణంగా,  “పరి ఫౌండేషన్” సహకారంతో ప్రభుత్వ పాటశాలలలో “Digital Class Room” ద్వారా  వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాభోదనకి చేస్తున్న ప్రయత్నాలు ఒక కార్యరూపం దాల్చాయి.  భారత ప్రధానిగారి “స్వచ్చ భారత్” పిలుపుని స్పూర్తిగా తీసుకుని  దత్తత తీసుకున్న అన్ని ప్రభుత్వ పాటశాలలలో శుభ్రమైన త్రాగునీరు, మరుగుదొడ్డి వసతుల కోసం  “స్నేహహస్తాలు ” కృషి చేస్తుంది. 
 
ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో ప్రతి అడుగుని ఒక పాటంగా నేర్చుకుంటూ ఒక “మోడల్ విద్యా విధానం“(Model Educational System) నిర్మించే దిశగా “స్నేహహస్తాలు” చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ ప్రధాన భూమిక స్నేహితులదే. “స్నేహ హస్తాలు” అనే ఒక ఆలోచన ఈరోజు ఒక వ్యవస్థగా రూపాంతరం చెందింది అంటే అది కేవలం మన స్నేహబృందం మీద వున్న నమ్మకం వల్లనే సాధ్యపడింది. మేమున్నాం అంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ,ప్రేరణనిస్తూ ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతున్న స్నేహితులకి, ప్రభుత్వ ఉపాధ్యాయులకి,అధికారులకి ,ఆయా గ్రామాల ప్రజలకి మరియు విద్యార్ధులందరికీ పేరుపేరునా అక్షర సుమాంజలి.  

PDF Download: Sneha Hastalu (1)

 
 
                                                                                                                                                                                                మీ 
                                                                                                                                                                                    స్నేహహస్తాలు ఫౌండేషన్
విద్యా  దానం చేద్దాం..విజ్ఞాన భారతాన్ని నిర్మిద్దాం
                                                                                                                                                                                www.snehahasthaalu.org
“Modern Telugu Society- Centre for Diversified & Distributed Development”

Leave a Comment