హిమాచల్‌కు రాజీవ్ త్రివేది

triహైదరాబాద్: తెలంగాణ స్పెషల్ పోలీసు అదనపు డీజీగా ఉన్న ఐపీఎస్ సీనియర్ అధికారి రాజీవ్ త్రివేది గురువారం ఉదయం హిమాచల్‌ప్రదేశ్ వెళ్తున్నారు. అక్కడి మండి జిల్లాలోని బియాస్ నదిలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో ఆయన నేరుగా పాలుపంచుకుంటారు. కిలోమీటర్ల మేర సైక్లింగ్, మారథాన్‌లు, సుదీర్ఘ ఈతలకు త్రివేదీ ప్రసిద్ధి. ఇప్పటికే అనేకసార్లు భారత్-శ్రీలంక మధ్య ఉన్న జలసంధితో పాటు రాజమండ్రి వద్ద గోదావరి నదిలో నిర్విరామంగా ఈదారు. 2012 జనవరిలో ముంబైలో జరిగిన 42 కి.మీ. మారథాన్‌ను 3.20 గంటల్లో పూర్తి చేశారు.

రాజీవ్ త్రివేదీ కృష్ణాజిల్లా ఎస్పీగా పని చేసిన సమయంలో కృష్ణా-గుంటూరు సరిహద్దుల్లో ఉన్న ఓ కాల్వలో బస్సు బోల్తాపడిన ఘటనలో స్వయంగా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 2008లో బలిమెల ఉదంతం జరిగినప్పుడు నేరుగా అక్కడకు వెళ్లి గ్రేహౌండ్స్ సిబ్బంది మృతదేహాల కోసం నదిలో గాలించారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ గల్లంతైన సందర్భంలోనూ త్రివేదీ ల్యాండ్ సెర్చ్ ఆపరేషన్‌కు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించి కాలినడకన నల్లమలలో కిలోమీటర్లమేర ప్రాంతాన్ని జల్లెడపట్టారు.రాజీవ్ త్రివేది గతంలో నిర్వహించిన రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్స్‌ను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆయనను హిమాచల్‌ప్రదేశ్ పంపుతోంది.

Leave a Comment