సౌర వెలుగులకు 1,000 కోట్లు

81405027189_625x300విద్యుత్తు రంగంలో గుజరాత్‌ను అరుణ్‌జైట్లీ ఆదర్శంగా తీసుకున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యం లభించింది. సౌర విద్యుత్తు రంగానికి రూ.1,000 కోట్లు కేటాయించారు. దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. పవన విద్యుదుత్పత్తికి ప్రోత్సాహకాలు, థర్మల్ ప్లాంట్లలో పరిశుభ్రమైన బొగ్గు వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్ బాధ్యతలు చేపట్టగానే గుజరాత్‌లో పర్యటించి అక్కడ విద్యుత్తు విధానాలను అధ్యయనం చేయటం ఈ బడ్జెట్‌లో ప్రతిబింబించింది.

రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, జమ్మూకాశ్మీర్‌లో అల్ట్రా మెగా సౌర విద్యుత్తు ప్రాజెక్టులు నెలకొల్పేందుకు రూ.500 కోట్లు కేటాయింపు.
సౌర విద్యుత్తు ఆధారంగా పనిచేసే వ్యవసాయ పంపుసెట్లు, నీటి సరఫరా కేంద్రాల కోసం రూ. 400 కోట్లతో ప్రత్యేక పథకం. లక్ష పంపుసెట్లకు సౌర విద్యుత్తు అందుబాటులో తెచ్చేలా చర్యలు.
కాలువల ఒడ్డున 1 మెగా వాట్ సామర్థ్యం కలిగిన పార్కుల నిర్మాణానికి అదనంగా రూ.100 కోట్లు.
ఈ ఆర్థిక ఏడాదిలో హరిత శక్తి కారిడార్ ప్రాజెక్టు పనులు వేగవంతం. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు తదితర సంప్రదాయేతర ఇంధన వనరుల ఆధారంగా సేకరించిన విద్యుత్తును ఈ ప్రాజెక్టు ద్వారా గ్రిడ్‌కు కలుపుతారు.
సౌర విద్యుత్తును గరిష్టంగా వినియోగించుకోవటంపై దృష్టి. సౌర విద్యుదుత్పత్తికి ప్రోత్సాహకాలు. సోలార్ ఫొటో వాల్టాయిక్ రిబ్బన్ల తయారీకి వినియోగించే కాపర్ వైర్ల దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ సుంకం మినహాయింపు.
సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టు స్థాపనకు వినియోగించే యంత్రాలు, పరికరాల  దిగుమతులపై 5 శాతం కస్టమ్స్ సుంకం మినహాయింపు.
పస్తుతం దేశవ్యాప్తంగా 2,49,488 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుండగా ఇందులో 31,692 మెగావాట్లు సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అవుతోంది.

 బొగ్గు వినియోగంపై సెస్సు రెట్టింపు
థర్మల్ విద్యుదుత్పత్తిలో కాలుష్యం లేని శుభ్రమైన బొగ్గు వినియోగ పనుల కోసం ప్రాథమికంగా రూ.100 కోట్ల కేటాయింపు
బొగ్గు వాడకంపై విధిస్తున్న సెస్సు టన్నుకు రూ.50 నుంచి రూ.100కి పెంపు.

 పవన విద్యుత్తుకు ఊతం
గాలి ఆధారంగా పనిచేసే విద్యుత్తు జనరేటర్ల బేరింగ్‌ల కోసం వాడే స్టీల్ రింగుల దిగుమతిపై సుంకం 10 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింపు.
పవన విద్యుత్తు జనరేటర్ల తయారీ ముడిపదార్థాల దిగుమతిపై 4 శాతం సుంకం తగ్గింపు.
* కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల(బయో-సీఎన్‌జీ) స్థాపనకు అవసరమైన యంత్రాలు, పరికరాల దిగుమతులపై 5 శాతం బేసిక్ కస్టమ్స్ సుంకం తగ్గింపు.

Leave a Comment