‘జనాభా 21 కోట్లు.. అయినా అత్యాచారాలు తక్కువే’

51398459164_625x300న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అనగానే అత్యాచారాలకు రాజధాని అన్నమాట ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ రోజుకు కనీసం రెండు మూడు అత్యాచార కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బదయూ లాంటి దారుణ ఘటనలు కూడా జరిగాయి. అయినా అవేవీ సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ దృష్టికి వచ్చినట్లు లేవు. ఎందుకంటే.. అక్కడ ఆయన కన్నకొడుకే పాలన సాగిస్తున్నాడు మరి. ఉత్తరప్రదేశ్లో 21 కోట్ల మంది ప్రజలున్నా.. అత్యాచాలు మాత్రం చాలా తక్కువ సంఖ్యలోనే జరుగుతున్నాయని ములాయం వ్యాఖ్యానించారు.  32 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, ఆమెను హతమార్చిన సంఘటనపై విలేకరులు ఆయనను ప్రశ్నించినప్పుడు ములాయం ఇలా వ్యాఖ్యానించారు.ఇంతకుముందు ఏప్రిల్ నెలలో కూడా ములాయం ఇలాగే తన వ్యాఖ్యలతో దుమారం రేపారు. ‘అబ్బాయిలంటే అబ్బాయిలే. వాళ్లు తప్పులు చేస్తారు’ అని ఆయన అన్న మాటలతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ మండిపడ్డారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఒక్క సంఘటన జరిగితే ప్రభుత్వం సిగ్గుపడాలని, ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. ములాయం లాంటివాళ్లు చేస్తున్న ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలతో నేరగాళ్లకు ప్రోత్సాహం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీకే చెందిన శోభా ఓఝా అన్నారు

Leave a Comment