40 మంది భారతీయుల అపహరణ

iraqఇరాక్‌లో తిరుగుబాటుదారుల దుశ్చర్య
మోసుల్ పట్టణంలో అపహరణ
ఇరాక్ ప్రభుత్వంతో భారత్ సంప్రదింపులు

న్యూఢిల్లీ: ఉపాధి కోసం పొట్టచేతపట్టుకొని ఇరాక్ వెళ్లిన 40 మంది భారతీయులు జీహాదీ సున్నీ మిలిటెంట్ల చెరలో చిక్కుకున్నారు. ప్రభుత్వ బలగాలపై దాడులకు తెగబడుతూ పలు పట్టణాలను ఆక్రమించుకుంటున్న మిలిటెంట్లు ఉత్తర ఇరాక్‌లోని మోసుల్ పట్టణాన్ని మంగళవారం అధీనంలోకి తీసుకున్న సమయంలో 40 మంది భారత కార్మికులను అపహరించారు. తారిక్ నూర్ అల్‌హుదా కంపెనీకి చెందిన ఓ నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న వీరిని మంగళవారం మరో ప్రాంతానికి తరలిస్తుండగా ఈ కిడ్నాప్ జరిగింది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ బుధవారం ఢిల్లీలో మీడియాకు చెప్పారు. ‘‘అవును. 40 మంది భారత కార్మికులు కిడ్నాప్‌కు గురైనట్లు నిర్ధారించగలను’’ అని చెప్పారు. కిడ్నాప్ జరిగినట్లు ఇంటర్నేషనల్ రెడ్ క్రిసెంట్, పలు సంస్థలు నిర్ధారించాయన్నారు. అయితే వారి ఆచూకీకి సంబంధించిన వివరాలు లేవన్నారు. కిడ్నాపర్ల నుంచి కూడా ఫోన్‌కాల్స్ అందలేదని వివరించారు. ఈ ఉదంతంపై మరింత సమాచారం సేకరించేందుకు ఇరాక్ ప్రభుత్వంతోపాటు ఇరాక్‌లోని ఐక్యరాజ్య సమితి సహాయ మిషన్ (యునామీ)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్బరుద్దీన్ చెప్పారు. ఈ కష్ట సమయంలో భారత్‌కు సహాయ సహకారాలు అందించగల అందరితోనూ పనిచేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. తాజా పరిస్థితిని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమీక్షిస్తున్నారని…కిడ్నాప్‌కు గురైన వారి కుటుంబ సభ్యులతో ఆమె ఫోన్లో మాట్లాడారన్నారు. బందీల విడుదలకు అమెరికా సాయం తీసుకుంటున్నారా? అని ప్రశ్నించగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఇరాక్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్క భారతీయుడిని కాపాడేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోబోమని హామీ ఇచ్చారు. ఇరాక్‌లో సుమారు 10 వేల మంది భారతీయులు ఉన్నారని…వారిలో కేవలం 100 మంది మాత్రమే ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్నారని అక్బరుద్దీన్ వివరించారు. కాగా, మిలిటెంట్లు 100 మందికిపైగా విదేశీ కార్మికులను అపహరించినట్లు అక్కడి వార్తాసంస్థలను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. వారిలో 60 మందిని కిర్కుక్ పట్టణం నుంచే మిలిటెంట్లు కిడ్నాప్ చేసినట్లు తెలిపింది.
 
 46 మంది నర్సులు క్షేమమే
 ఇరాక్, సిరియాలకు చెందిన ఇస్లామిక్ మిలిటెంట్లు (ఐఎస్‌ఐఎస్) మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ స్వస్థలమైన తిక్రిత్ పట్టణాన్ని అధీనంలోకి తీసుకోవడంతో అక్కడి ఆస్పత్రుల్లో చిక్కుకుపోయిన 46 మంది భారత నర్సులు క్షేమంగానే ఉన్నారని అక్బరుద్దీన్ వెల్లడించారు. భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తి మేరకు ఇంటర్నేషనల్ రెడ్ క్రిసెంట్ ఆ నర్సులతో మాట్లాడిందన్నారు. వారిలో కొందరు అక్కడే ఉంటామని చెప్పారని… మిగిలిన వారిని వెనక్కు రప్పించే విషయమై అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. 46 మంది నర్సుల్లో 30 మంది గత ఏడాది ఆగస్టులో ఇరాక్ వెళ్లగా మిగిలిన వారు ఈ ఏడాది ఫిబ్రవరిలో వెళ్లారు.

Leave a Comment